ప్రాణం తీసిన అతి వేగం

15 Sep, 2019 03:57 IST|Sakshi
కారు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులు(ఫైల్‌). గాయాలతో బయటపడిన విష్ణు (సర్కిల్‌లో)

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి సజీవ దహనం

రెయిలింగ్‌ను ఢీకొని ఎగిరిపడ్డ కారు

పెట్రోల్‌ లీకై క్షణాల్లో చెలరేగిన మంటలు

చిత్తూరు జిల్లాలో విషాదం 

ఒకరిని బయటకు లాగి రక్షించిన స్థానికులు

పలమనేరు (చిత్తూరు జిల్లా): అతివేగం రెప్పపాటులో ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం కారు బోల్తా పడి అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. కారును నడుపుతున్న టీటీడీ ఉద్యోగి విష్ణు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తా..
తిరుపతికి చెందిన విష్ణు తన సోదరిని బెంగళూరులో దింపేందుకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా పలమనేరు నియోజవర్గ పరిధిలోని టీటీడీ గోశాల వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఎడమ వైపు రెయిలింగ్‌ను ఢీకొని వంద మీటర్ల దూరంలో ఎగిరిపడింది. కారు ఇంజన్‌ రెయిలింగ్‌ను రాసుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగి పెట్రోల్‌ ట్యాంకుకు నిప్పంటుకుంది. సగం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్న విష్ణును సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు రక్షించి 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి రిఫర్‌ చేశారు. అనంతరం గంగవరం పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీతో కారును బయటకు తీశారు. అప్పటికే కారులోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మృతులు విష్ణు భార్య జాహ్నవి (35), కుమారుడు పవన్‌రామ్‌ (13), కుమార్తె అస్త్రిత (10), విష్ణు సోదరి కళ (42), ఆమె కుమారుడు భానుతేజ (19)గా గుర్తించారు. 

పెట్రోలు లీకై మంటలు వ్యాపించడంతో..
చిత్తూరు ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుల బంధువులను ఓదార్చారు. పెట్రోలు కారు కావడం, ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో అదుపు తప్పి దుర్ఘటన జరిగినట్లు ఎస్పీ చెప్పారు.

అందరూ తిరుమలేశుని పరమ భక్తులు
టీటీడీ ఉద్యోగి చంద్రశేఖర్, ఆయన భార్య నాగరత్నమ్మ తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. వారి కుమారుడు విష్ణు ఉన్నత చదువులు పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగం చేస్తుండేవాడు. కోడలు జాహ్నవి ఆయుర్వేద వైద్య నిపుణురాలు. కాగా తమ బిడ్డ విష్ణు శ్రీవారి చెంత సేవలు చేయాలని భావించిన చంద్రశేఖర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. అమెరికాలో ఉంటున్న తమ బిడ్డకు టీటీడీలో అవకాశం కల్పించారు. దీంతో విష్ణు తిరుపతిలోనే ఉంటున్నారు. మరోవైపు బెంగళూరులో ఉంటున్న ఆయన చెల్లి శ్రీవారి దర్శనం కోసం బిడ్డ భానుతేజతో కలసి తిరుపతి వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధం కాగా.. విష్ణు బెంగుళూరులో ఉంటున్న తమ మామ రామకృష్ణ (భార్య తండ్రి) అనారోగ్యం బారిన పడటంతో ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వారివెంట వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు