బాలికల అక్రమ రవాణాను నిరోధించాలి

31 Jul, 2014 01:46 IST|Sakshi
బాలికల అక్రమ రవాణాను నిరోధించాలి

ఏలూరు(ఆర్‌ఆర్ పేట) : బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్నారు.  ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక సెయింట్ థెరిస్సా పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. బాలికల, మహిళల రక్షణకు సమర్థవంతమైన చట్టాలు ఎన్ని అమల్లో ఉన్నా సమాజంలో సరైన చైతన్యం లేని కారణంగా ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.  
 
 అన్ని దేశాల్లోను డ్రగ్స్ వినియోగించి బాలికలను, మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని, దీనిపట్ల ప్రతి ఒక్కరూ అపమ్రత్తంగా ఉండాలని సూచించారు. చిన్ననాటి నుంచే ఏది మంచి, ఏది చెడు అనే విషయంపై సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. పరిచయం లేనివారితో ఏవిధంగా మెలగాలనే విషయంపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలు ఎక్కువగా తెలిసినవారి ద్వారానే జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి పోలీస్, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. బాలికల అక్రమ రవాణా ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత శాఖలు స్పందిస్తే 48 గంటల్లోనే ఆ బాలికలు ఎక్కడ ఉన్నా రక్షించవచ్చన్నారు.
 
 8 మండలాల నుంచి
 బాలికల అక్రమ రవాణా
  స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ ఆర్.సూయిజ్ మాట్లాడుతూ బాలికల అక్రమ రవాణాకు సంబంధించిన కార్యకలాపాలు జిల్లాలోని 8 మండలాల్లో నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. ఈ మండలాల్లో పోలీస్ శాఖ సమన్వయంతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  బాలికల అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రతి గ్రామంలోను స్థానికులతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా బాలల సంరక్షణ సమితి అధ్యక్షుడు స్నేహన్, ఐసీడిఎస్ పీడీ వి.వసంతబాల, శాంతిదాత, ప్రతినిధి హెరాల్డ్‌బాబు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, సెయింట్ థెరిస్సా హైస్కూల్ ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా బాలికలతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు.
 

మరిన్ని వార్తలు