‘న్యాక్’పై గందరగోళం | Sakshi
Sakshi News home page

‘న్యాక్’పై గందరగోళం

Published Thu, Jul 31 2014 1:40 AM

confusion on Ncc

జాతీయ నిర్మాణ సంస్థ తమదే అంటున్న ఇరు రాష్ట్రాలు
 
న్యాక్‌లో పాగా వేసిన తెలంగాణ సర్కారు.. సీఎం కోసం సిద్ధమవుతున్న ఓ అంతస్తు
బిక్షమయ్యను డీజీగా నియమించిన టీ సర్కారు
ఏపీ డీజీగా శాంబాబ్ నియమకం
పునర్వ్యవస్థీకరణ చట్టంలోలేని న్యాక్    
 

హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న జాతీయ నిర్మాణ సంస్థ (న్యాక్) కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఈ సంస్థ తమ రాష్ట్రానిదంటే తమ రాష్ట్రానికే చెందుతుందంటూ దానిని స్వాధీనం చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నాక్‌లో పాగా వేసింది. ఆ సంస్థలోని ఒక అంతస్తును స్వాధీనం చేసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రికి కార్యాలయం ఏర్పాటునకు అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టింది. న్యాక్ ఏర్పాటు చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థకు డీజీని కూడా నియమించింది. చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి న్యాక్‌కు చైర్మన్‌గా ఉంటారు. ఆయన మాత్రమే డీజీని నియమించాలి. తెలంగాణ ప్రభుత్వం డీజీని నియమించాల్సి వస్తే న్యాక్ చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇవేమీ లేకుండానే తెలంగాణ సర్కారు ఆ రాష్ట్ర ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ బిక్షమయ్యను డీజీగా నియమించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. న్యాక్‌పై సర్వ హక్కులు ఏపీకే ఉంటాయని అంటోంది. న్యాక్‌కు డీజీగా రహదారుల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌ను బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తెలంగాణ ఉద్యోగులు నిరసన తెలిపారు. శాంబాబ్ వస్తే ఘొరావ్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో  శాంబాబ్ అక్కడికి వెళ్లకుండా సచివాలయంలోనే డీజీగా బాధ్యతలు స్వీకరించి, ఈ విషయాన్ని ప్రభుత్వానికి, నాక్‌కు తెలియజేశారు. న్యాక్ ప్రైవేటు సొసైటీ కింద ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్‌లోను చేర్చలేదు. దీంతో న్యాక్ అధికారులే పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. అయితే న్యాక్ ఒక ప్రాంతానికి చెందిన సంస్థ కానందున రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలున్నందున 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. కేంద్రం సూచన మేరకు న్యాక్‌ను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్రం కోరింది. అయినా ఇప్పటివరకు కేంద్రం న్యాక్‌ను ఏ షెడ్యూల్‌లోను చేర్చలేదు. ఇది చేయాలంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం న్యాక్ తాను నాటిన మొక్క అని, అదీ తనకే చెందాలనే భావనలో ఉన్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అదేమీ కుదరదని తెలంగాణ సర్కారు అంటోంది. తెలంగాణ సర్కారు చట్టానికి విరుద్ధంగా నియామకం చేసినా, ఒక అంతస్తులో పాగా వేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని అధికారవర్గాలు అంటున్నాయి.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement