బంగారు పండగపై కరోనా పడగ 

26 Apr, 2020 11:14 IST|Sakshi

నేడు అక్షయ తృతీయ  లాక్‌డౌన్‌ నేపథ్యంలో దుకాణాల మూత

రూ. 40 కోట్ల మేర వ్యాపారానికి గండి

కరోనాతో వాయిదా పడిన పెళ్లిళ్లు 

లబోదిబోమంటున్న బంగారు వ్యాపారులు 

జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి భారీగా తగ్గిన ఆదాయం  

సాక్షి, నెల్లూరు:  అక్షయ తృతీయ బంగారు పండగ. ఎంతో మంది ఈ పండగకు బంగారం కొనేందుకు మక్కువ చూపుతారు. ఎంతో కొంత బంగారం కొంటే చాలు.. సిరి సంపదలు సమకూరుతాయనే ఓ నమ్మకం. ఆదివారం అక్షయ తృతీయ. జిల్లాలో ఏటా అక్షయ తృతీయ సందర్భంగా సుమారు రూ.40 కోట్ల మేర విక్రయాలు జరుగుతాయి. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23 నుంచి మే 3 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఫలితంగా బంగారు దుకాణాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా చిన్న, పెద్ద బంగారు దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా ఏడాదికి రూ.1,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది.

ప్రధానంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, అక్షర తృతీయ తదితర వాటికి భారీగా బంగారాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి వ్యాపారులు బంగారం కొనుగోళ్లపై భారీ రాయితీలు ప్రకటిస్తుంటారు. దీంతో బంగారు దుకాణాలన్నీ జనాలతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఏటా అక్షర తృతీయ పండగకు బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిపోతుంటాయి. వ్యాపారులు సైతం రకరకాల ఆఫర్లు ప్రకటించి వినియోగదారుల మనసును గెలుచుకుంటున్నారు. ఏటా అక్షర తృతీయ పండగకు కనీసం రూ. 40 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒక రూపాయి కూడా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు.  

ప్రభుత్వానికి తగ్గనున్న జీఎస్టీ ఆదాయం  
బంగారు కొనుగోళ్లపై వ్యాపారులు 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా బంగారు వ్యాపారం సుమారు రూ.1000 కోట్లకు జిల్లా నుంచి జీఎస్టీ రూపంలో రూ. 30 కోట్లు మేర ఆదాయం వస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్లు జరిగే సీజన్‌తోపాటు అక్షయ తృతీయ నేపథ్యంలో ఈ నెలలోనే సుమారు రూ.200 కోట్ల మేర వ్యాపారం జరిగేది. నెల రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం, ఇంకెంత కాలం లాక్‌డౌన్‌ ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సీజన్‌లో జీఎస్టీ రూపంలో సుమారు రూ.6 కోట్ల ఆదాయం కోల్పోయింది. లాక్‌డౌన్‌ కొనసాగితే ఇటు వ్యాపారులకు, అటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంది.   

అక్షయ తృతీయకు వ్యాపారం నిల్‌  
లాక్‌డౌన్‌ నేపథ్యంలో బంగారం దుకాణాలు తెరిసే పరిస్థితి లేదు. నెల రోజులుగా దుకాణాలు మూసివేశాం. ప్రతి ఏటా అక్షయ తృతీయకు దుకాణాలు కళకళలాడుతంండేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ముహూర్తాలు ఉన్నా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు, ఫంక్షన్లను వాయిదా వేసుకున్నారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారు లేరు.  – శాంతిలాల్, ది నెల్లూరు డి్రస్టిక్ట్‌ బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర చీఫ్‌ ఆర్గనైజర్‌  

మరిన్ని వార్తలు