లింకువర్కర్లకు పచ్చజెండా

20 Jan, 2014 03:22 IST|Sakshi

 నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రాల్లో లింకు వర్కర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీకళ తెలిపారు. పనిభారం వల్ల ప్రస్తుతం ఉన్న కార్యకర్తలు, ఆయాలు సేవలు అందించడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వారికి వెసులుబాటు కల్పించడానికి వీలుగా లింకువర్కర్లను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో 232 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 132 కేంద్రాల్లో మొదటివిడతగా లింకువర్కర్లను నియమించనున్నామని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు.
 
 మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి వీలుగా ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం రుణసదుపాయాన్ని కలుగజేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్టు శ్రీకళ చెప్పారు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణసదుపాయం అందిస్తామని చెప్పారు. ఈ రుణం మంజూరులో 50 శాతంసబ్సిడీని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. మిగిలిన 50 శాతం వారు ఆర్థికంగా అభివృద్ధిచెందుతూ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. టైలరింగ్, టిఫిన్‌సెంటర్లు, టెంట్‌హౌస్‌లు, ఫొటోస్టూడియో వంటి వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఈ రుణం మంజూరులో దారిద్య్ర రేఖకు దిగువనున్న మహిళలకు; గృహహింసకు, భర్త వేధింపులకు గురైన వారికి, వితంతువులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు ఎనిమిది మందిని ఎంపిక చేసి రుణం ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేస్తామని చెప్పారు. 21 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగినవారు ఇందుకు అర్హులని చెప్పారు. గ్రామాల్లో సంవత్సరాదాయం రూ.60 వేలు, పట్టణంలో రూ.75 వేలు మించి ఉండరాదని తెలిపారు.
 
  ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీస్కూల్ మాత్రమే నిర్వహించేవారమని, ఇక నుండి ఎల్‌కేజీ, యుకేజీ కూడా ప్రారంభిస్తున్నామని శ్రీకళ చెప్పారు. నెలకొకసారి ప్రీస్కూల్ డేను నిర్వహిస్తామని చెప్పారు. ఇందిరమ్మ అమృతహస్తం ద్వారా గర్భిణులకు 25 రోజుల పాటు గుడ్లు, పాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు ప్రాజెక్టు పరిధిలో 1625మంది గర్భిణులు, 1629మంది బాలింతలు ఉన్నారని చెప్పారు. అమృతహస్తం ద్వారా వీరందరికీ పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. అమృతహస్తంపై విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్యాస్‌స్టౌలు కూడా వారం, పదిరోజుల్లో ఆయా కేంద్రాలకు చేరుతాయని చెప్పారు.

>
మరిన్ని వార్తలు