డీఎంహెచ్‌ఓ .. డిష్యుం డిష్యుం

9 Jul, 2015 04:00 IST|Sakshi

సాంబమూర్తినగర్ (కాకినాడ) : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సావిత్రమ్మ పనితీరు సక్రమంగా లేదని, ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ ఇటీవల ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్‌కు డీఎంహెచ్‌ఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాల్సిందిగా కలెక్టర్ ఆ లేఖలో కోరారు. దీంతో డాక్టర్ పవన్ కుమార్ బుధవారం ఉదయం డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన రాజమండ్రి పుష్కర పనుల పరిశీలన నిమిత్తం వెళ్లారు. కొద్దిసేపటికే డాక్టర్ సావిత్రమ్మ డీఎంహెచ్‌ఓ చాంబర్‌కు వచ్చి కూర్చున్నారు.
 
 తనకు ప్రభుత్వం నుంచి గాని, కలెక్టర్ నుంచి గాని ఎటువంటి లిఖితపూర్వకమైన ఉత్తర్వులు అందలేదని, తాను డీఎంహెచ్‌ఓగానే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. డాక్టర్ పవన్‌కుమార్ అదనపు బాధ్యతలు స్వీకరించారు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ఆయన బాధ్యతలు స్వీకరించిన సంగతి తనకు తెలియదన్నారు. కాగా ఇద్దరు అధికారుల మధ్య సిబ్బంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుంటున్నారు. తన వద్దే విధులు నిర్వహించాలని, తన వాహనం ఇచ్చేది లేదని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సావిత్రమ్మ పట్టుబట్టడం వివాదాస్పదమవుతోంది. అంతేకాకుండా ఆమె కలెక్టర్ అరుణ్ కుమార్‌కు వ్యతిరేకంగా సిబ్బందితో చర్చించడం కూడా వివాదాలకు తావిస్తోంది.
 
  తనకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నుంచి తాఖీదులు అందేంతవరకూ తానే డీఎంహెచ్‌ఓనని చెబుతూ కలెక్టర్ ఆదేశాలను ఉటంకించడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా కలెక్టర్ అరుణ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేందుకు మంగళవారం రాత్రి డాక్టర్ సావిత్రమ్మ కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే జిల్లా అధికారి కావడంతో పోలీసులు అందుకు తిరస్కరించి, తిప్పి పంపివేసినట్లు కొంతమంది సిబ్బంది చర్చించుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు