సీమాంధ్ర నేతలపై వేటు వేయాలి: జీవన్‌రెడ్డి

25 Jul, 2013 16:21 IST|Sakshi
సీమాంధ్ర నేతలపై వేటు వేయాలి: జీవన్‌రెడ్డి

కరీంనగర్: ప్రత్యేక తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసేసుకుందని రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి సమయంలో సీమాంధ్రనేతలు కుట్రలు చేయడాన్ని ఆయన ఖండించారు. సీమాంధ్ర నేతలపై అధిష్టానం క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని కోరారు. అధిష్టానం మెతక వైఖరి వల్లే సీమాంధ్ర నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని అన్నారు. తెలంగాణపై ప్రకటన చేసిన 2009 డిసెంబర్‌ 9నే వారిపై వేటువేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ఊహగానాలు వీస్తుండడంతో సీమాంధ్రకు చెందిన 19 మంది మంత్రులు నిన్న మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్‌లో సమావేశమయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్, రాష్ట్ర మంత్రి డాక్టర్ ఎస్. శైలజానాథ్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చర్చ హాట్‌హాట్‌గా జరిగింది.

 సమైక్యాంధ్రను కొనసాగించకుండా తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటే దానిని అడ్డుకోవడానికి ఎంత దూరమైనా, ఏ చర్యకైనా వెనుకాడరాదని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పదవులు వీడుతాం..అని మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి తేల్చి చెప్పారు. అవసరమైతే పార్టీనీ వీడేందుకు వెనుకాడబోమని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు