సంబరాల నడుమ కొత్త రైళ్ల పరుగులు

25 Dec, 2013 02:23 IST|Sakshi
సంబరాల నడుమ కొత్త రైళ్ల పరుగులు

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆధునాతన బోగీలతో కొత్త రైళ్లు పట్టాలెక్కాయి. మంగళవారం ఉదయం సరిగ్గా 7.45 గంటలకు ఒకటి, 8 గంటలకు మరో రైలు పరుగులు తీశాయి. విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-గాంధీధాం ఎక్స్‌ప్రెస్ రైళ్లను  కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. పాత-కొత్త బోగీలను కలపాలని ముందు భావించినా జోన్ సాధన సమితి సభ్యులు ఆందోళన చేస్తారేమోనని తక్కువ బోగీలతోనైనా ప్రారంభించారు. కేవలం13 బోగీలతోనే సర్దుబాటు చేశారు.

కొత్త రైళ్ల ప్రారంభం పై గుజరాత్ సమాజ్ సభ్యులు హర్షం ప్రకటించి ప్రయాణికులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కాగా కొత్త రైళ్లలో ప్రయాణికులు స్వల్పంగానే ఉన్నారు. విశాఖ-జోధ్‌పూర్‌లో 365 మంది.. విశాఖ-గాంధీధాంలో 146 మంది మాత్రమే పయనమయ్యారు. వీరంతా అప్పటికప్పుడే బయల్దేరిన వారు కావడంతో రైల్లోనే రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.

కొత్త రైళ్ల ప్రారంభం సందర్భంగా కొందరు జైనులు, మార్వాడీలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కొత్త రైలు లేక గుజరాత్ వెళ్లేందుకు నానా పాట్లు పడేవారు. చెన్నై వెళ్లి అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కోసం ప్రదక్షిణలు చేసేవారు. రెండు మూడు రోజుల పాటు నిరీక్షించినా ఆ రైల్లో చోటు లభ్యమయ్యేది కాదు. ఇప్పుడా బాధ తప్పిందని సురేష్ జైన్ అనే వ్యక్తి ఆనందం వ్యక్తం చేశారు.
 
సమోసాలు తింటూ కులాసాగా ప్రయాణం...

 విశాఖపట్నం-జోధ్‌పూర్ రైలు సమోసాలకు ప్రసిద్ధి గాంచిన ఊరు మీదుగా ప్రయాణిస్తుంది. భిలాస్‌పూర్‌కు అతి సమీపంలో వున్న పెండ్రారోడ్ స్టేషన్ అంటేనే నోరూరించే సమోసాలకు పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. అందుకే ఈ రైల్లో కొందరు జోధ్‌పూర్ వాసులు సమోసాలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు