నిప్పుల వాన

5 May, 2019 03:47 IST|Sakshi

రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు 

సాధారణం కంటే 4–7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు   

భయపెడుతున్న వడగాడ్పులు 

మరో మూడు రోజులు భగభగలే  

ఉక్కపోత తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, రోగుల అవస్థలు 

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం సూచన  

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఓవైపు కణకణ మండుతున్న సూర్యుడు, మరోవైపు భగభగమంటున్న భూతాపంతో వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. నిప్పులు కక్కే ఎండలతో వడగాడ్పులు వీస్తున్నాయి. సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఈ సీజన్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 45 డిగ్రీల సెల్సియస్‌ పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఉష్ణతీవ్రత ఎక్కువగా ఉంది. ఫొని తుపాను వాయవ్య, పశ్చిమ గాలులను తన వైపు లాక్కుంటోంది. ఫలితంగా చల్లదనాన్నిచ్చే దక్షిణ గాలులు వీయడం లేదు.

ఫొని తుపాను పూర్తిగా బలహీన పడే దాకా గాలులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫొని అల్పపీడనంగా మారాక మరో రెండు మూడు రోజుల వరకు సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు. అంటే ఈ నెల పదో తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటోంది. వేడి గాలులను తట్టుకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు అగ్నికీలల్లా తగులుతున్నాయి. వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం 11–12 గంటల వరకే పనిచేసి, తర్వాత చెట్ల నీడకు వెళుతున్నారు. గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు వేడికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు.

ఇంట్లోనే ఉన్నప్పటికీ భవనం పైకప్పు నుంచి, గోడల నుంచి వస్తున్న వేడి, ఉక్కపోతను తట్టుకోలేపోతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న మూడు రోజులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంటే విజయనగం, శ్రీకాకుళం మినహా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వడగాడ్పులు తప్పవన్నమాట. వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని ఐఎండీ సూచించింది. 

47 డిగ్రీల దాకా నమోదు కానున్న ఉష్ణోగ్రతలు 
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ నెల 5న (ఆదివారం) కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 6న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 7న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45–47 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 42– 45 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 8న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 9న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 45–46 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  

ప్రజలను చైతన్య పర్చండి 
ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నందున వడగాడ్పులు తీవ్రమవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలను చైతన్య పరిచేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను ఆదేశించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వడగాడ్పుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపత్తు నిర్వహణ శాఖ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. 

జాగ్రత్తలు తప్పనిసరి 
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఎండ సమయంలో సాధ్యమైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఇళ్లల్లో గానీ, నీడపట్టున గానీ ఉండాలి. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి నేరుగా ఎండ తగలకుండా గొడుగు ఉపయోగించాలి. తెలుపు లేదా లేత రంగు నూలు వస్త్రాలు ధరించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరినీరు లాంటివి సేవించాలి. డీహైడ్రేషన్‌ నుంచి రక్షణ కోసం ఉప్పు కలిపిన మజ్జిగ సేవించడం ఉత్తమం. ఇళ్లల్లో కూడా వేడి ఎక్కువగా ఉంటే గది వాతావరణాన్ని తగ్గించుకోవాలి. ఇందుకోసం కిటికీలకు వట్టివేర్ల తెరలను కట్టి నీరు చల్లాలి. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, గాలి తగిలేలా చూడాలి. చల్లని నీటిలో తడిపిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఫ్యాన్‌ కింద ఉంచవచ్చు. అప్పటికీ కోలుకోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తగిన వైద్యం అందించాలి’’ అని నిపుణులు చెప్పారు. 

మరిన్ని వార్తలు