రాజ్యసభకు బొత్స?

20 Jan, 2014 01:23 IST|Sakshi
రాజ్యసభకు బొత్స?

హైకమాండ్ వద్ద లాబీయింగ్
 సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్టాన పెద్దలందరినీ కలిసి తనను ఈ సారి రాజ్యసభకు పంపాలని కూడా కోరినట్లు తెలిసింది. తాజాగా రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. తన  ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన బొత్స.. పనిలోపనిగా తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని యువనేత రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, మాజీ ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్‌లకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది.
 
 బొత్స సత్యనారాయణ ప్రస్తుతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభ జన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడినందున రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనలో ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు. మొన్నటి వరకు విజయనగరం జిల్లా అంతటా బొత్స ప్రభావం చూపారు. కానీ, విభజన పరిణామాలతోపాటు జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన ప్రతిష్టను మరింత పలుచన చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మేలని భావించిన బొత్స.. రాజ్యసభ సీటును దక్కించుకునే పనిలో పడ్డట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కొందరు విలేకరులు బొత్స వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా కొట్టిపారేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా అన్నారు.
 
 అయితే, గత ఏడాది జైపూర్‌లో నిర్వహించిన ఏఐసీసీ సదస్సులో పీసీసీ, డీసీసీ అధ్యక్షులుగా ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నియమావళిని పార్టీ రూపొందించింది. వచ్చే ఎన్నికల నుంచే దానిని అమలు చేస్తామని కూడా పేర్కొంది. ఆ నియమావళిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న బొత్స.. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో పూర్తిగా పార్టీ తరపున రాష్ట్రమంతటా ప్రచారం చేస్తానని, ప్రతిఫలంగా తనను రాజ్యసభకు పంపాలని హైకమాండ్ పెద్దలవద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు