జగనన్న వసతి దీవెనకు రూ. 2,300 కోట్లు 

6 Jan, 2020 05:28 IST|Sakshi

11,61,244 మంది విద్యార్థులకు పథకం వర్తింపు 

త్వరలో కొత్త కార్డుల జారీ 

సాక్షి, అమరావతి: జగనన్న వసతి దీవెన పథకంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. ఇటీవల వైఎస్సార్‌ నవశకంలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 95,887 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులయ్యారు. ఇంటర్, ఆపైన చదువుతూ.. స్కాలర్‌షిప్‌లు తీసుకునే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హుడు. ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేలు అందజేస్తుంది.

ఈ మొత్తాన్ని తల్లి బ్యాంకు అకౌంట్‌కు జమచేస్తారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు 10,65,357 మంది కాగా.. కొత్తగా 95,887 మంది విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 11,61,244కు చేరింది. త్వరలోనే వీరికి వసతి దీవెన కార్డులు అందచేస్తారు. వసతి దీవెన పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా నిధులు ఖర్చు కానున్నాయి. ఇంతవరకూ ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్‌ ఫీజుల కింద ప్రభుత్వం రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 2,300 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అంటే అదనంగా రూ. 1,500 కోట్లు ఖర్చుచేయాలి. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు సంవత్సరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సిందేనని ప్రభుత్వం భావించింది. అందుకే ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకు సాగుతోంది.  

మరిన్ని వార్తలు