లారీ ఇసుక రూ.50వేలకా?

11 Feb, 2016 06:35 IST|Sakshi
లారీ ఇసుక రూ.50వేలకా?

ఇసుక వ్యాపారుల తీరుపై హైకోర్టు విస్మయం
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వ్యాపారుల తీరుపై హైకోర్టు ఆశ్చర్యపోయింది. రూ. 9వేలు విలువ చేసే లారీ ఇసుకను వ్యాపారులు ఏకంగా రూ. 50 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత భారీ మొత్తాలకు ఇసుక అమ్ముతుంటే సామాన్యులు ఎలా ఇసుక కొనుగోలు చేయగలరని ప్రశ్నించింది. ఇంత రేట్లకు ఇసుక కొనడం సామాన్యులకు తలకు మించిన భారమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.

అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ మాట్లాడుతూ.. దీని వెనుక ఇసుక మాఫియా ఉందని, ఇసుక ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందని కోర్టుకు తెలిపారు. అందులో భాగంగానే తవ్వితీసిన ఇసుకకు క్యూబిక్ మీటర్‌కు గరిష్టంగా రూ. 500లను నిర్ణయించామని ఆయన తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తవ్వి తీసిన ఇసుకకు క్యూబిక్ మీటర్‌కు గరిష్టంగా రూ.500 నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాకర్ల సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు