ఆర్జనపై మక్కువ.. సేవలు తక్కువ

14 Oct, 2019 09:06 IST|Sakshi

నంద్యాల ఎస్‌బీఐ కాలనీకి చెందిన పవన్‌కుమార్‌ అనే పదేళ్ల బాలుడు నెల రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వారం క్రితం అతన్ని చికిత్స కోసం తండ్రి శంకర్‌ నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించి.. కడుపులో పేగుకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని నిర్ధారించారు. రెండు రోజులు చికిత్స అందించిన తర్వాత ఆపరేషన్‌ తప్పనిసరిగా చేయాలని తండ్రికి చెప్పారు. అయితే.. ఆపరేషన్‌ చేయాల్సిన వైద్యురాలు ఇక్కడ కుదరదని, బయటకు వెళ్లి చేయించుకోవాలని సూచించారు. దీంతో శంకర్‌ బయట వడ్డీకి అప్పు తెచ్చి, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుమారుడికి ఆపరేషన్‌ చేయించాడు.  

సాక్షి, బొమ్మలసత్రం(కర్నూలు) : ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. మరోవైపు కొందరు వైద్యుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సొంత ప్రాక్టీసుపైనే మొగ్గు చూపుతూ..ప్రభుత్వాసుపత్రిలో సేవలను గాలికొదిలేస్తున్నారు. ముఖ్యంగా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేటు క్లినిక్‌ల పేరుతో కార్పొరేట్‌ స్థాయి ఆసుపత్రులను నడుపుతున్నారు. వారు ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయారు. ఒకవేళ బదిలీ చేసినా..వారికున్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వస్తున్నారు. అలా కుదరకపోతే ఉన్నతాధికారులకు మేనేజ్‌ చేసుకుని డిప్యుటేషన్‌ పేరుతో తిరిగి రావడం పరిపాటిగా మారింది. పాత వైద్యుల స్థానాలు ఖాళీ కాకపోవడంతో కొత్తవారికి అవకాశం లేకుండా పోతోంది. పేదలకు నిజంగా సేవ చేయాలనుకునే వైద్యులు.. ఇక్కడి సీనియర్ల తీరును చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. 

శస్త్రచికిత్స చేయాలంటే సొంత క్లినిక్‌కు వెళ్లాల్సిందే.. 
నంద్యాల ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ 1,200 నుంచి 1,400 మంది అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు. వారిలో 300 నుంచి 400 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. వారిలో ప్రతి రోజూ దాదాపు 40 మంది రోగులకు ఏదో ఒక శస్త్రచికిత్స అవసరమవుతోంది. అయితే.. పది మందికి కూడా వైద్యులు  శస్త్రచికిత్సలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.  అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాలంటే సొంత క్లినిక్‌కు రావాలని నిర్మొహమాటంగా చెబుతున్నారు.   

ఓపీకే పరిమితం 
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో సర్జరీలు నిర్వహించాల్సిన వైద్యులలో కొందరు ఓపీ సేవలకే పరిమితమవుతున్నారు. మరికొందరు ఓపీ సేవలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఉదయం మొక్కుబడిగా కొంత సమయం రోగులకు  కేటాయించి.. తర్వాత అక్కడి నుంచి నేరుగా సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు.  ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు జనరల్‌ సర్జన్‌లు, ముగ్గురు ఆర్థోపెడిక్‌ సర్జన్లు, ముగ్గురు కంటి వైద్యనిపుణులు,  ఒకరు ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ పనిచేస్తున్నారు. గతంలో జనరల్‌ సర్జరీలు నెలకు 50 దాకా నిర్వహించేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య 30కి పడిపోయింది. ఆర్థోకు సంబంధించి గతంలో 12 నుంచి 15 వరకు శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రస్తుతం 5 నుంచి 8 మాత్రమే జరుగుతున్నాయి. సిజేరియన్‌ ఆపరేషన్‌లు గతంలో 250 నుంచి 300 దాకా నిర్వహించేవారు. ప్రస్తుతం 200కు మించడం లేదు. మిగిలిన కేసులను సొంత క్లినిక్‌లకు తరలించుకుపోతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఒక కంటి వైద్య విభాగంలో మాత్రమే ప్రతి నెలా 80 నుంచి 100 ఆపరేషన్‌లు క్రమంగా నిర్వహిస్తున్నారు.  

కార్పొరేట్‌ తరహా ఆసుపత్రులు 
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులకు కార్పొరేట్‌ తరహా ఆసుపత్రులు ఉన్నాయి.    సొంత క్లినిక్‌లకు వచ్చే రోగులకు వైద్యం అందించడానికే వారికి సమయం చాలడం లేదు. ఇక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు సేవలు ఏ మేరకు అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో జనరల్‌ సర్జన్‌గా పనిచేస్తున్న ఓ వైద్యురాలు పట్టణంలోని పద్మావతినగర్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అలాగే ఓ ప్రసూతి వైద్య నిపుణురాలు కూడా అదే ప్రాంతంలో క్లినిక్‌ నడుపుతున్నారు. ఓ చిన్నపిల్లల వైద్యుడు స్థానిక రెవెన్యూ క్వార్టర్స్‌లో, ఇదే విభాగానికి చెందిన వైద్యురాలు ప్రభుత్వాసుపత్రి ఎదురుగానే ప్రైవేటు ప్రాక్టీసు చేస్తుండడం గమనార్హం. వీరితో పాటు మరికొందరు కూడా ఇదే బాటలో ఉన్నారు. 

శస్త్రచికిత్సలు తగ్గిన మాట వాస్తవమే
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించటంలో నిర్లక్ష్యం వహిస్తున్న మాట వాస్తవమే. వారిని హెచ్చరించాల్సిందిగా ఇది వరకే సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌ను ఆదేశించా. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు కార్పొరేట్‌ స్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తుంటే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాసుపత్రికి వస్తున్న రోగులను సొంత క్లినిక్‌లకు తరలించినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవు.  
–రామకృష్ణారావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త (డీఎస్‌హెచ్‌ఎస్‌)  

మరిన్ని వార్తలు