జిల్లాకు బడ్జెట్‌లో కేటాయింపులేవీ?

15 Mar, 2017 21:30 IST|Sakshi
► ఉస్సురంటున్న జిల్లా ప్రజలు
 
విజయనగరం: ఏటా సంక్షేమ రంగాలకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తున్న జిల్లాకు మాత్రం ఆ స్థాయిలో నిధులు విడుదల కావడం లేదు. ప్రతీ ఏటా విడుదల చేస్తున్నప్పటికీ జిల్లాకు రావాల్సిన నిధులు మాత్రం రాకపోవడంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటున్నది. దీంతో జిల్లా ప్రజలు మాకు ఆ ఫలాలు ఎందుకు అందడం లేదోనని బుర్రలు పీక్కుంటున్నారు. 
 
బీసీ సంక్షేమ శాఖలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం సుమారు 45వేల మంది విద్యార్ధులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రూ.25 కోట్ల బడ్జెట్‌ విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదల చేయడం లేదు. అలాగే బీసీ కార్పొరేషన్‌లో రుణాల కోసం రెండేళ్లుగా బడ్జెట్‌ కేటాయిస్తున్నా నిధులు మాత్రం విడుదల కావడం లేదు. బీసీ కార్పొరేషన్‌లో జిల్లాలో 2169 మందికి రూ.19.44 కోట్లు విడుదల కావాల్సి ఉండగా నేటికీ ఒక్క రుణమూ లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌లో 1309 మందికి రూ.8.99 కోట్లు విడుదల కావాల్సి ఉండగా నేటికీ ఒక్క రుణమూ ఇవ్వలేదు.

అలాగే మైనార్టీ కార్పొరేషన్‌లో 64 మందికి లక్ష చొప్పున ఇస్తామన్న సబ్సిడీకి అతీ గతీ లేదు. ఇక కాపు కార్పొరేషన్‌లో ఈ ఏడాది వెయ్యి కోట్లు ప్రకటించినా గతేడాది మంజూరైన రూ.6కోట్లలో ఒక్క రుణమూ లేదు. దీంతో ఏటా బడ్జెట్‌ ప్రకటించడమే తప్ప ఎటువంటి అభివృద్ధి కనిపించక లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంఘాలకైతే మరి చెప్పనక్కర లేదు. గతేడాది 404 సంఘాల్లోని 6064 మంది లబ్దిదారులు దరఖాస్తు చేసుకుంటే వారికి నేటికీ రుణాలివ్వలేదు. దీంతో ఈ ఏడాది ఇస్తామన్న అధికారులు. ప్రభుత్వం మాట విన్న సంఘాలకు ఇవ్వాల్సిన రూ.15.15 కోట్లు నేటికీ ఇవ్వలేదు.
 
సబ్‌ ప్లాన్‌ నిధులు ఇతర రంగాలకు...
ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.9,747 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించారు. కానీ జిల్లాకు మాత్రం ప్రయోజనాలు కనిపించడం లేదు. జిల్లాలో మంజూరైనా ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు ఇతర రంగాలకు కేటాయిస్తున్నారనీ దళిత సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఉదాహరణలు కూడా సమీక్షా సమావేశాల్లో ఏకరువు పెడుతున్నారు. వికలాంగులను వివాహం చేసుకునే సకలాంగులకు ఇచ్చే రూ.50వేల పారితోషకానికి ఎన్నో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఈ సారి ఆ పారితోషకాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్టు బడ్జెట్‌లో పొందుపరిచారు. దీనికైనా జిల్లాలో లబ్దిదారులను కొర్రీలు లేకుండా ఎంపిక చేస్తారానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అలాగే అన్న క్యాంటీన్ల కోసం రూ.200 కోట్లు కేటాయించినా జిల్లాకు ఒనగూరేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయలేదు. ఇప్పట్లో చేసే ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి లేదు. అలాగే ఎల్‌పీజీ కనెక్షన్ల కోసం రూ.350 కోట్లను కేటాయించారు. గతేడాది కంపెనీలకు కేటాయించిన బడ్జెట్‌ను నేటికీ కంపెనీలకు పంపిణీ చేయలేదు. దీంతో కంపెనీలు గ్యాస్‌ కనెక్షన్లను పంపిణీ చేయడం మానేశాయి.

ఇప్పుడు కేటాయించిన బడ్జెట్‌ను ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని జిల్లాలోని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పశుగణాభివృద్ధికి మాత్రం రూ.1112 కోట్లు కేటాయించారు. కానీ జిల్లాలో పశు గణాభివృద్ధి కనిపించడం లేదు. ఏటా పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశువుల అక్రమ రవాణాతో జిల్లా నుంచి పెద్ద ఎత్తున గోమాంసం, పశువులను తరలించడం తెల్సిందే! మరి పశుగణాభివృద్ధికి ఇంకెక్కడ అవకాశముందో ప్రభుత్వమే చెప్పాలి.
మరిన్ని వార్తలు