ఉనికి కోల్పోయారు

13 May, 2014 01:31 IST|Sakshi
ఉనికి కోల్పోయారు

 పాడేరు,న్యూస్‌లైన్: విశాఖ ఏజెన్సీ ప్రశాంతంగా ఉండాలన్నదే తమ ఆశయమని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ అన్నారు.  సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులంతా అభివృద్ధిని కోరుకుంటున్నారన్న విషయం ఇటీవలి ఎన్నికలే రుజువు చేశాయన్నారు. మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చినప్పటికీ  గిరిజనులు స్వేచ్ఛగా ఓటు వేశారని ఆయన తెలిపారు.  ప్రగతి నిరోధకులైన మావోయిస్టులు ఇప్పుడు ఉనికి కోల్పోయారని అన్నారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు వందలాది మంది లొంగిపోయారని పలువురు దళ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులను కూడా అరెస్ట్ చేశామన్నారు.

కిల్లంకోట, బలపం, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, అన్నవరం, సప్పర్ల, దారకొండ వంటి మారుమూల ప్రాంతాల్లో వారికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు.  ఏజెన్సీలోని అన్ని మారుమూల రోడ్లను అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయిన రోడ్ల పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఏఎస్పీ కె.ఫకీరప్ప, ట్రైనీ డీఎస్పీ మహేంద్ర, సీఐ ఎన్.సాయి, ఎస్‌ఐలు ధనుంజయ్, ప్రసాద్ ఉన్నారు.
 
 మోదకొండమ్మకు ఎస్పీ పూజలు
 మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను తిలకించేందుకు విక్రమ్‌జీత్ దుగ్గల్ సోమవారం పాడేరు వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి రూరల్ ఎస్పీ కుటుంబం పేరిట ప్రత్యేక కుంకుమార్చన పూజలు కూడా జరిపారు. నర్సీపట్నం ఓఎస్‌డి ఏఆర్ దామోదర్, ఏఎస్పీ కె.ఫకీరప్ప తదితరులూ అమ్మవారిని దర్శించుకున్నారు.
 
 సీసీ కెమెరాల ఏర్పాటు

 జాతరతో అవాంఛనీయ ఘటనలు సంభవిస్తే అనుమానితులను గుర్తించేందుకని పోలీసు శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంలోని అధికారులు ఈ దృశ్యాలను పరశీలిస్తున్నారు. గత 29 ఏళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు