కేసులు సరే.. శిక్షలేవి?

23 Nov, 2013 02:55 IST|Sakshi
కేసులు సరే.. శిక్షలేవి?

సాక్షి, హైదరాబాద్: హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు వంటి తీవ్రనేరాల సమయంలో పోలీ సుల హడావిడి అంతాఇంతాకాదు. అయితే ఆ కేసుల దర్యాప్తు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్క డే’ అన్న చందంగా ఉంది. కేసుల నమోదులో పోలీసులది ఆరంభశూరత్వంగా...దర్యాప్తులో నిర్లక్ష్యంగా కనబడుతోంది. హత్యలు,అత్యాచారాలు, దోపిడీలు, ఆస్తికోసం హత్యలు వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో రాష్ట్రవ్యాప్తంగా శిక్షలు పడుతున్నది 10 నుంచి 12 శాతం మాత్రమే. రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానాల వంటి చిన్నచిన్న కేసులను చూస్తే నిందితుల్లో 50 శాతం మందికే శిక్షలు పడుతున్నాయి. రాష్ట్ర పోలీసుశాఖ జరిపిన అధ్యయనంలో తేలిన కఠోరమైన నిజాలివి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసుశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక అందించింది.
 
 2010లో వివిధ కేసుల్లో శిక్షల శాతం 31.47 శాతం ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎట్టకేలకూ 49.99 శాతానికి పెరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో శిక్షల శాతం మరీ తక్కువగా ఉంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీల వంటి తీవ్రస్థాయి నేరాలలో రాజధాని నగరంలో నమోదవుతున్న కేసుల్లో ఒకటి నుంచి రెండు శాతం వరకే శిక్షలు పడుతున్నాయంటే కేసుల దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. తీవ్రస్థాయి నేరాలతోపాటు సంచలనాత్మక కేసుల దర్యాప్తుపై దృష్టిసారించడం, కోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ పర్యవేక్షించేలా ప్రతి జిల్లాలో కోర్టు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటుచేశామని పోలీసు కో-ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ ‘సాక్షి’కి వివరించారు. దీనివల్లే ఈ ఏడాది శిక్షల శాతం గత ఏడాదితో పోలిస్తే 12 శాతం వరకు పెరిగిందని తెలిపారు. 
 
 శిక్షల శాతం పెరగకపోవడానికి కారణాలివే: దర్యాప్తులో నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యం, నేర నిర్ధారణకు అవసరమైన ఆధారాల సేకరణపై దృష్టిపెట్టకపోవడం, కోర్టుకు శాస్త్రీయమైన ఆధారాలను అందించలేకపోవడం...వంటి కారణాల వల్లే శిక్షల శాతం పెరగడంలేదని పోలీసుశాఖ అధ్యయనంలో తేలింది. కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం, కోర్టుల్లో దీర్ఘకాలికంగా కేసుల విచారణ కొనసాగడం వల్ల సాక్షులను బెదిరించి, ప్రలోభ పెట్టడం ద్వారా నింది తులు బయటపడుతున్నారని తేలింది.

అత్యధిక కేసుల్లో నిర్ణీత గడువు ఆరు నెలలు గడువులోపల చార్జిషీటు దాఖలుచేయకపోవడం కూడా మరో కారణంగా ఉంది.కాగా, దీర్ఘకాలికంగా కేసులు పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉండడడం ప్రధాన సమస్యగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో మొత్తం 98,546 కేసులు దర్యాప్తు దశలో ఉన్నట్టు పోలీసుశాఖ నివేదికలో పేర్కొంది.

 

 

>
మరిన్ని వార్తలు