విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషం

2 Oct, 2013 01:28 IST|Sakshi

అనంతగిరి, న్యూస్‌లైన్: చేవెళ్లలో మంత్రి రఘువీరారెడ్డి పర్యటన లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషమని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ అన్నారు. లాఠీచార్జిలో గాయపడి వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నాయకులు క్రిష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డిలను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు కాలరాస్తున్నారన్నారు.
 
 విద్యార్థుల ఉద్యమంతోనే గతం లో 14ఎఫ్ నిబంధనను తొలగించారని, దీంతో పోలీసులే లాభపడ్డారన్నారు. అలాంటి పోలీసులు ఉద్యమకారులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థులను పోలీ సులు చితకబాదుతుంటే ఏసీ కారుల్లో కూర్చుని తెలంగాణ మంత్రుల చూస్తూ వెళ్లిపోవడం దారుణమన్నారు. ఇలాంటి మంత్రులకు సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గాయపడ్డ విద్యార్థి నాయకులను పరామర్శించిన వారిలో విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్, నియోజకవర్గ చైర్మన్ నర్సింలు, యూత్ జేఏసీ జిల్లా చైర్మన్ నర్సింలు, నాయకులు కిశోర్, శ్రీకాంత్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు