అర్ధరాత్రి.. కాళరాత్రి!

21 Dec, 2014 02:20 IST|Sakshi
అర్ధరాత్రి.. కాళరాత్రి!

పెళ్లి బృందం లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య
వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న 31 మంది క్షతగాత్రులు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తుముల, జేసీ
మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఓదార్పు

 
గిద్దలూరు : పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. 31 మంది క్షతగాత్రులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం- కర్నాలు జిల్లా సరిహద్దులోని నలమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద పెళ్లి బృందం లారీ శుక్రవారం అర్ధరాత్రి బోల్తా పడిన విషయం తెలిసిందే. మృతులు, క్షతగాత్రుల స్వగ్రామం నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 11 మంది, అక్కడి ప్రైవేటు వైద్యశాలలో ఒకరు, నంద్యాలలో ముగ్గురు, ఒంగోలులో ఒకరు, నరసరావుపేటలో ముగ్గురు, గిద్దలూరులోని డీజీఆర్ వైద్యశాలలో ఏడుగురు, ఆరోగ్యశ్రీ, ఏరియా వైద్యశాలలో ఆరుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కర్నూలు, నరసరావుపేటల్లో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతులు వీరే..
చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు (55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ (45)లు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు పలువురు నాయకులు శనివారం పరామర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ముత్తుముల విషయం తెలుసుకుని వెంటనే కర్నూలు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న 12 మందిని పరామర్శించారు.  

అనంతరం నంద్యాలలో పలు వైద్యశాల్లో చికిత్సలు పొందుతున్న ముగ్గురిని పరామర్శించారు. మృతదేహాలను త్వరగా బంధువులకు అప్పగించాలని వైద్యులను కోరారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి లారీని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల, డీజీఆర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యం అందుతున్న తీరును డాక్టర్ సూరిబాబు, డాక్టర్ హరనాథరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న వారిని తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు మార్చాలని ఆర్డీఓ చంద్రశేఖరరావును జేసీ ఆదేశించారు.  ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధులు సూరా స్వామిరంగారెడ్డి, దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కాకునూరి హిమశేఖరరెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నాయకులు రెడ్డి కాశిరెడ్డి, సీవీఎన్ ప్రసాద్, దప్పిలి కాశిరెడ్డి, దమ్మాల జనార్దన్, వైజా కృష్ణారెడ్డి, బొర్రా కృష్ణారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు సాయం రూ.లక్ష
మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ శనివారం గిద్దలూరు వచ్చి ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి రూ. 20 వేలు చొప్పున సాయం చేయనున్నట్లు చెప్పారు. రాచర్ల ఎంపీపీ రెడ్డి లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్డి కాశిరెడ్డిలు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించారు.

క్షతగాత్రులకూ ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి : ముత్తుముల
లారీ ప్రమాదంలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. కలెక్టర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జేసీ చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచేలా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాననిహామీ ఇచ్చారు.

ఒంగోలు టౌన్ : పెళ్లి బృందం లారీ బోల్తాపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో మంజూరు చేసినట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు గిద్దలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా