తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు

14 Dec, 2013 00:52 IST|Sakshi
తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు

వచ్చేది ఉద్యోగమిత్ర ప్రభుత్వం: కేసీఆర్

‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఇక ఏ శక్తీ అడ్డుకోలేదు... నూటికి నూరుశాతం తెలంగాణ కల సాకారమైతది...ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయూస్ నుంచి ఐఏఎస్ వరకు అందరం కలిసి పిడికెలెత్తినం.. కాబట్టే కేంద్రం దిగి వస్తుంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం హన్మకొండలో జరిగిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యూరు. అనంతరం తనను సన్మానించిన ఉద్యోగ సంఘాల నాయకులతో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంత ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి స్కేల్ ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఉద్యమంలో మాదిరిగానే తెలంగాణ వచ్చిన తర్వాత పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని వారిని కోరారు. టీఎన్జీవోల ఉద్యమానికి నిజాం కాలం నుంచి పనిచేస్తున్న చరిత్ర ఉందని చెప్పారు.
 

1969లోనే తెలంగాణ కోసం సువర్ణాక్షరాలతో లిఖించదగిన పాత్ర నిర్వహించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతుందని 2001లో టీఆర్‌ఎస్‌ను  ఏర్పాటు చేసిన రోజే స్పష్టం చేశానన్నారు. ప్రారంభం నుంచి పట్టు విడవకుండా లక్ష్యం చేరేవరకు భర్తృహరి చెప్పిన ప్రకారం ముందుకు సాగామంటూ శ్లోకాన్ని వినిపించారు. ఉద్యోగ మిత్ర ప్రభుత్వం రానుందని అన్నారు. పార్టీలు, పాలసీలు ఏవైనా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆ ఫలాలు అందించేది ఉద్యోగులేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ పచ్చ బడాలె.. పరిశ్రమలు అభివృద్ధి చెందాలె.. నిరుద్యోగ భూతాన్ని పారదోలాలే.. ఇదంతా సాగాలంటే కలిసి పనిచేయాల్సి ఉంటుందని ‘నవ్వెటోని ముందు జారి పడొద్దం’టూ కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యోగుల హౌసింగ్, క్వార్టర్ల నిర్మాణం తదితర అవసరాలను తీర్చే పథకానికి రూపకల్పన చేయాల్సి ఉందని తెలిపారు. తొలి నుంచి అన్ని విధాలుగా తనకు సహకారం అందించిన ఉద్యోగులకు తలవంచి నమస్కరిస్తున్నానని, జన్మంతా వారికి రుణపడి ఉంటానని చెప్పారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు కొలా రాజేష్ గౌడ్, హుస్సేన్ తదితరులు కేసీఆర్‌కు తలపాగా పెట్టి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు పేర్వారం రాములు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


 కేసీఆర్ నిరంతర సమీక్ష

 

అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షించారు. వరంగల్‌లో శుక్రవారం జరిగిన పార్టీ నేత కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి హాజరైన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు, టి.హరీష్‌రావుతో ఎప్పటికప్పుడు ఫోనులో మాట్లాడారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చిందా, రాకుంటే ఎవరిని కలిసి ఒత్తిడి చేయాలి, అధికారపార్టీతో పాటు మిగిలిన పార్టీల్లోని తెలంగాణ ఎమ్మెల్యేలతో సమన్వయం వంటివాటిపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. మధ్యాహ్నానికీ రాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. కేసీఆర్ సూచనల మేరకే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసును స్పీకర్‌కు అందించారు. కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి పార్టీ అధినేతగా హాజరు అవుతున్నందున ఎమ్మెల్యేలు హాజరుకాకపోయినా ఫర్వాలేదని, శాసనసభలో ముఖ్యమైన రోజు కాబట్టి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని గట్టిగా సూచించారు.


 

మరిన్ని వార్తలు