బిల్లుపై గడువే గండం! | Sakshi
Sakshi News home page

బిల్లుపై గడువే గండం!

Published Sat, Dec 14 2013 12:55 AM

t.bill time limitation!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం కోసం విధించిన 40 రోజుల గడువే ఇప్పుడున్న ప్రధాన అవరోధమని, దాన్ని ఐక్యంగా అధిగమించాల్సిన అవసరముందని తెలంగాణ ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా అంతా ‘తెలంగాణ పార్టీ’గా భావించుకుని కలసికట్టుగా సాగాలని నిర్ణయించారు.
 
 తెలంగాణ జర్నలిస్టుల ఫోరం శుక్రవారం ఏర్పాటు చేసిన తేనీటీ విందుకు తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు హాజరయ్యారు. 371డి అధికరణం, బిల్లులోని క్లాజుల వంటి రాజ్యాంగపరమైన అంశాలపై సమస్యలు లేవనెత్తి అసెంబ్లీలో బిల్లును వివాదాస్పదం చేయజూసే అవకాశముందని విశ్లేషించారు. సోమవారమే బిల్లు అసెంబ్లీకి రావచ్చని మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు చెప్పారు. 40 రోజుల పాటు చర్చించాలని సీమాంధ్ర నేతలు పట్టుబట్టవచ్చని, దాన్ని అధిగమించడానికి తెలంగాణ సభ్యులంతా పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వస్తారు, పార్టీల అభిప్రాయాలేమిటి, ఏ పార్టీకి ఎలాంటి లాభం జరుగుతుందనే విషయాలను పక్కన పెట్టి బిల్లును వీలైనంత త్వరగా రాష్ట్రపతికి పంపించడానికి కృషి చేయాలని కోరారు. బిల్లును తెలంగాణ సభ్యులంతా అంశాలవారీగా విభజించుకుని, స్పష్టంగా, క్లుప్తంగా ప్రసంగించాలని సూచించారు.
 
 మంత్రుల నేతృత్వంలో చలో రాజ్‌భవన్
 
 సోమవారం అసెంబ్లీకి బిల్లు రాకుంటే ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి మంత్రులే నాయకత్వం వహించాలని, వారితో తామంతా కలిసి వస్తామని టీఆర్‌ఎస్ ప్రతిపాదన చేసింది. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా రాజ్‌భవన్‌కు వెళ్లి, అక్కడే బైఠాయించాలని సూచించింది. బిల్లును విజయవంతంగా పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మంత్రులపై ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేతలన్నారు. భేటీలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బసవరాజు సారయ్య, డి.కె.అరుణ, జి.ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, విప్‌లు ఈరవత్రి అనిల్, ఆరేపల్లి మోహన్, అన్ని పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ అధ్యక్షత వహించగా జేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, నేతలు సి.విఠల్, దేవీ ప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, కె.రవీందర్ రెడ్డి, పల్లె రవికుమార్, పి.వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement