పత్తిరైతు చిత్తు

16 Feb, 2015 05:26 IST|Sakshi
పత్తిరైతు చిత్తు

పత్తి రైతు దగా పడుతున్నాడు. రైతులకు మద్దతు ధర కల్పించి అండగా నిలవాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనూ దళారులదే రాజ్యమవుతోంది. కేంద్రాల్లో నిబంధనలతో విసిగి వేసారిన రైతులు తప్పనిసరై దళారులకు పత్తిని విక్రయిస్తూ నష్టపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వ మద్దతు ధర కాగితాలకే పరిమితమవుతోంది. క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతులు నష్టపోతున్నారు.
 
- సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇక్కట్లు
- మద్దతు ధర కరువు
- బినామీ పేర్లతో వ్యాపారుల అమ్మకాలు
- కాగితాలకే పరిమితమవుతున్న మద్దతు ధర

ఒంగోలు టూటౌన్: ప్రస్తుతం మార్కెట్‌లో పత్తికి పెద్దగా డిమాండ్ లేదు. దీంతో ఇప్పటికే తీవ్రనష్టాల్లో ఉన్న పత్తిరైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో క్వింటా పత్తికి రూ.3,750 నుంచి రూ.4,050 మధ్య చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. వ్యాపారులే రైతుల అవతారం ఎత్తి సర్కారు మద్దతు దక్కించుకుంటున్నారు. సీసీఐ కేంద్రాల్లో సమస్యల వలన రైతులు గిట్టుబాటు పొందలేకపోతున్నారు.

చెల్లింపుల జాప్యం, తేమశాతం, రంగు మారిందన్న సాకుతో ధరల్లో కోత పెడుతుండటం రైతులను నిరాశకు గురిచేస్తోంది. దీన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు రూ.3,500 క్వింటాకు ఇవ్వడంతో గత్యంతరం లేక అక్కడే అమ్ముకుంటున్నారు. ఫలితంగా క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు పత్తిరైతులు నష్టపోతున్నారు. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో అలవిమాలిన నిర్లక్ష్యం విహ స్తోంది. జిల్లాలో ఖరీఫ్, వేసవి పత్తి 56,167 హెక్టార్లు లక్ష్యం కాగా  రెండూ కలిపి 75,571 హెక్టార్లు సాగు చేశారు.

ఇందులో సమ్మర్ కాటన్ 12,517 హెక్టార్ల కన్నా ఎక్కువే సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఖర్చులు, పరిస్థితులు అనుకూలించక దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. దీనికి తోడు కూలీల డిమాండ్ పెరిగిపోవడంతో కొన్నిచోట్ల పొలాల్లోనే దిగుబడిని వదిలేశారు. నష్టాలబాటలో అవస్థలు ఎదుర్కొంటున్న పత్తిరైతుకు మద్దతు ధర ఇవ్వాల్సింది పోయి సీసీఐ కేంద్రాలు ఇంకా కష్టాలు, చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తేమశాతం, రంగుమార్పు, ధ్రువీకరణ పత్రం వంటి నిబంధనలతో వేధిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు రూ.4,050 పొందాలంటే అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ఎనిమిది సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించిన చోట దళారులు రాజ్యమేలుతున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలకే పరిమితమవుతోంది. నిబంధనల పేరుతో ఓవైపు సీసీఐ కేంద్రాల్లో పత్తిని సక్రమంగా కొనుగోలు చేయడంలేదు. ఇదే అదునుగా దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  
 
నిబంధనలతో బెంబేలు:
సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుందామని గంపెడాశతో వచ్చిన రైతులు ఇక్కడి నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. తేమ 12 శాతం కంటే తక్కువ ఉండాలనే నిబంధన రైతుల పాలిట శాపమైంది.  అసలే శీతాకాలం కావడం, మార్కెట్‌కు రైతులు రాత్రిపూట పత్తిని తీసుకువస్తుండటంతో మంచు కారణంగా తేమ శాతం  పెరుగుతోంది. దీన్ని అడ్డంపెట్టుకొని తేమశాతం ఎక్కువగా ఉందనే పేరుతో సీసీఐ సరుకును మద్దతు ధరకు కొనుగోలు చేయడంలేదు. కేవలం రూ.3,200 నుంచి రూ.3,300 మధ్యే కొనుగోలు చేయడం రైతులను కుంగదీస్తోంది.
 
దళారుల పన్నాగం:
సీసీఐ నిబంధనలను దళారులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తేమశాతం, రంగు మారడం, డబ్బు చెల్లింపుల్లో ఆలస్యం..తదితర ఇబ్బందులు సీసీఐ కేంద్రాల్లో రైతులకు ఎదురవుతుండటంతో దీనిని అసరాగా చేసుకుని దళారులు రైతుల నుంచి క్వింటాలు రూ.3,500 లోపు ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని బినామీ రైతుల పేర్లతో దళారులు, కొందరు కమీషన్ వ్యాపారులు సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.  
 
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం:
జిల్లాలో 15 ఏఎంసీలు ఉండగా వాటి పరిధిలో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, పూసపాడుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవంబర్‌లో ఒకటి, రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా..మరికొన్ని జనవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 లక్షల 4 వేల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు దాదాపు 2 లక్షలకు పైగా  క్వింటాళ్లు వరకు కొనుగోలు చేస్తుంటారని అధికారులు చెబుతున్నారు. సకాలంలో కేంద్రా లు ఏర్పాటు చేయకపోవడం, వెంటనే డబ్బులు చెల్లించకపోవడం, తేమ శాతం అడ్డంకి, ఇలా పలు కారణాలు, రైతుల ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా రూ.3,500 లకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పైగా ప్రైవేట్ వ్యాపారులు వెంటనే డబ్బు చెల్లిస్తుండటంతో అప్పుల బాధ తాళలేక కొంతమంది రైతులు అటువైపే మొగ్గుచూపుతున్నారు. రైతుల నుంచి కొన్న పత్తిని రైతుల పేరుమీదనే సీసీఐకి అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటూ లాభపడుతున్నాడు. పంట పండించిన రైతు గిట్టుబాటు ధర పొందలేక దిగజారిపోతున్నాడు.
 
ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు: మార్కెట్ ఏడీ సయ్యద్ రఫీ అహ్మద్

పత్తిని రైతుల నుంచి దళారులు కొన్నా..చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్ ఫీజు వసూలు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ఉండదు. నిబంధనల ప్రకారమే పత్తిని సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. రూ.3,880 నుంచి రూ.3,900 వరకు కొంటున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి.

మరిన్ని వార్తలు