సాహితీవేత్త ‘గూటాల’ కన్నుమూత | Sakshi
Sakshi News home page

సాహితీవేత్త ‘గూటాల’ కన్నుమూత

Published Thu, Jul 14 2016 2:35 AM

సాహితీవేత్త ‘గూటాల’ కన్నుమూత

- అనారోగ్యంతో విశాఖలో మృతి
- తెలుగు, ఆంగ్ల సాహిత్యంలో వాసికెక్కిన దిగ్గజం
- ప్రముఖుల సంతాపం.. రేపు అంత్యక్రియలు

 
 సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రఖ్యాత తెలుగు, ఆంగ్ల సాహితీవేత్త, విద్యావేత్త గూటాల కృష్ణమూర్తి (88) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో ఉన్న ఆయన విశాఖలోని సెయింట్ జోసెఫ్ (అమెరికన్) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య వెంకటరమణ వరం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1928 జూలై 10న అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం ఒడిశా) పర్లాకిమిడిలో కృష్ణమూర్తి జన్మించారు. భారతదేశంలో గూటాల గానూ, ఇంగ్లండ్‌లో జీకేగాను ఆయన సుప్రసిద్ధులు. ఆంధ్ర వర్సిటీలో బీఏ, ఎంఏ కోర్సులు, సాగర్ వర్సిటీలో డాక్టరాఫ్ ఫిలాసఫీ పూర్తి చేశారు.
 
 అమలాపురం ఎస్‌కేబీఆర్, బిలాస్‌పూర్‌లోని సీఎండీ కాలేజీల్లో అధ్యాపకుడిగా కొన్నాళ్లు పనిచేశారు. 1962లో లండన్ టైమ్స్ పత్రిక కార్యాలయంలో ఉద్యోగం కోసం వెళ్లి అక్కడే పీహెచ్‌డీ (1967లో) పూర్తి చేశారు. అనంతరం ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ సర్వీసులో ప్రవేశించి లండన్‌లోని వివిధ విద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశారు. ‘1890 సొసైటీ’ అనే సొసైటీని 1963లో స్థాపించి నాటి ఆంగ్ల కవులు, రచయితలు, కళాకారులపై పరిశోధనలు చేసి వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం ఆయన యూరోప్, అమెరికా దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలను శ్రీశ్రీతోనే పాడించి, తన ఇంట్లోనే రికార్డు చేయించారు.
 
తెలుగులో రచనలు..: భజగోవిందం, కుకుసం (వంట), క్లిననం (వంటపాత్రలు, ఇల్లు శుభ్రం చేయడం), స్థిపనం (సంసారం చేయడం), కననం (పిల్లలను కనడం) వంటివి ఆయన తెలుగు రచనల్లో కొన్ని. ఆయన టంగుటూరి సూర్యకుమారిపై 2008 లో పుస్తకం ప్రచురించారు. ఇలా ఉండగా గూటాల అంత్యక్రియలు శుక్రవారం విశాఖలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంతాపం తెలిపారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు నేల మీద ఉండి తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేస్తే.. బ్రిటిష్ గడ్డపై జీవిస్తూ అక్కడి వారికి ఆంగ్ల సాహిత్య సౌరభాల గురించి గూటాల తెలియజేశారని కొనియాడారు.
 
 వైఎస్ జగన్ సంతాపం
 గూటాల కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. పాశ్చాత్య ప్రపంచానికి తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయడంలో కృష్ణమూర్తి చేసిన సేవలు శ్లాఘనీయమైన వని కొనియాడారు. ఆయన మృతి ప్రపంచంలోని తెలుగు వారందరికీ తీరని లోటని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని జగన్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement