హైవేపై సీసీ కెమెరాలతో నిఘా

14 Mar, 2015 01:57 IST|Sakshi

వాహన వేగాన్ని నియంత్రించే స్పీడ్‌బ్రేకర్లు, స్టాపర్లు
 
సాలూరు: గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేయడంతోపాటు, ఒకవేళ సంభవిస్తే బాధ్యులను త్వరితగతిన గుర్తించేలా చేసేందుకు వీలుగా పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే సీఐగా బాధ్యతలు స్వీకరించిన జి.రామకృష్ణ ఈదిశగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు చర్యలు కార్యరూపం దాల్చగా ఇంకొన్ని ఆలోచనలు ఆచరణలోకి రావాల్సి  ఉంది. దీంతో పోలీసుల చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  
 
జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు

26వ నంబరు జాతీయ రహదారిపై స్థానిక తహశీల్దార్ కార్యాలయ జంక్షన్లో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను గుర్తించడంతో రోడ్డు ప్రమాదాలు, అక్రమరవాణా చేసే వాహనాలను సునాయాసంగా గుర్తించే అవకాశం కలుగుతుందని సీఐ రామకృష్ణ భావిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో రహదారులు ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం  ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసుల పనితీరుపై కూడా తమ శాఖ నిఘా పెట్టేందుకు దోహదపడుతుందంటున్నారు.
 
వేగ నియంత్రణకు
వాహన వేగాన్ని నియంత్రించేందుకు, తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు వీలుగా జాతీయ రహదారిపై పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లను ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌వద్ద వన్ వే ట్రాఫిక్ మార్గంపై స్పీడ్ బ్రేకర్‌లను నిర్మించారు. అలాగే కాస్త ముందుగా జాతీయ రహదారిపైన, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోను స్టాపర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల సత్ఫలితం వస్తుందని భావిస్తున్నారు.
 
త్వరలో జీపీఎస్ ఫోన్‌లు
అలాగే నోపార్కింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయనుండడంతో పాటు రాత్రివేళ విధులు నిర్వర్తించే పోలీసులకు, ట్రాఫిక్ నియంత్రణకు వెళ్లే వారిపై ఒక కన్నేసేలా చేసేందుకు ఉపకరించే జీపీఎస్ ఫోన్‌లను వినియోగంలోకి తేనున్నారు. దీనివల్ల ఏసమయంలో ఎక్కడ  ఉన్నారో ఇట్టే తెలుసుకోవడం సాధ్యమంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాలు, ప్రమాదాల అదుపునకు, చోటివ్వకుండా చర్యలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు