తుది విడత పంచాయతీ పోరు

30 Jul, 2013 05:13 IST|Sakshi
తుది విడత పంచాయతీ పోరు
పంచాయతీల్లో తుదిపోరుకు సమయం దగ్గరపడుతోంది. రాజకీయ సంచలనాలకు కేంద్రాలైన మచిలీపట్నం, గుడివాడ డివిజన్లలో జరగనున్న మూడోదశ ఎన్నికలపై జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇవి వైఎస్సార్‌సీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో కాంగ్రెస్, టీడీపీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 
 
సాక్షి, మచిలీపట్నం : తుది విడత పంచాయతీ పోరుకు వ్యూహప్రతివ్యూహాలతో పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నెల 31వ తేదీ బుధవారం ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే వైఎస్సార్‌పీపీకి గట్టి పట్టున్న సంగతి తేటతెల్లమవుతోంది. మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం తమదైన వ్యూహరచన చేశారు. 
 
జిల్లాలో జరిగిన నూజివీడు, విజయవాడ డివిజన్‌ల పంచాయతీ పోరులో తెలుగుదేశం పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని ఆ పార్టీ వర్గాలే విశ్లేషించుకుంటున్నాయి. అధికార పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. పోనీ మూడో దశలోనైనా పరువు పంచాయతీ కాకుండా ఉంటుందా అనే ఆందోళన ఇరు పార్టీలను పట్టి పీడిస్తోంది. వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడం కష్టసాధ్యమని భావించిన అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ నేతలు కుమ్మక్కు కుట్రలకు దిగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో బలమైన వైఎస్సార్‌సీపీ విజయావకాశాలను దెబ్బతీసేందుకు ఉమ్మడి పోరుకు తెరతీస్తున్నాయి. 
 
ఏదోక రకంగా పరువు నిలుపుకొనేందుకు నానాతంటాలు పడుతున్నాయి. పెడన నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు ఉప్పాల రామ్‌ప్రసాద్, వాకా వాసుదేవరావు, పామర్రు, కైకలూరు, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల  పరిధిలో పార్టీ సమన్వయకర్తలు ఉప్పులేటి కల్పన, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌లు మిగిలిన నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో పంచాయతీ పోరులో ముందున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో పోరు జిల్లా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 
 
 364 పంచాయతీల్లో తుదిపోరు..
 జిల్లాలో మూడోదశ ఎన్నికలు 364 పంచాయతీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మచిలీపట్నం, గుడివాడ డివిజన్‌లలోని 363 పంచాయతీలతో పాటు తొలి దశలో గుర్తులు తారుమారై వాయిదాపడిన చాట్రాయి మండలం సోమవరం పంచాయతీకి కూడా ఈ నెల 31న ఎన్నికలు జరగనున్నాయి. మచిలీపట్నం, గుడివాడ డివిజన్‌లలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 14 మండలాల్లో మొత్తం 452 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 89 ఏకగ్రీవమయ్యాయి. మచిలీపట్నం డివిజన్‌లోని 11 మండలాల్లో 234 పంచాయతీలకు గాను కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీకి ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 233 పంచాయతీల్లో 41 ఏకగ్రీవం కాగా, 192 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. గుడివాడ డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో మొత్తం 219 పంచాయతీల్లో 48 ఏకగ్రీవమయ్యాయి. 171 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
మచిలీపట్నం డివిజన్‌లోని మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, మొవ్వ మండలాల్లో, గుడివాడ డివిజన్‌లోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పామర్రు, పెదపారుపూడి, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో పంచాయతీ పోరు జరగనుంది. పెడన మండలం పెనుమల్లి పంచాయతీ ఏకగ్రీవ ఎన్నిక రద్దవడంతో దానికి ఆగస్టు 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రంతో తుదివిడత ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లకు ప్రలోభాల వల విసిరేందుకు అభ్యర్థులు ముమ్మర ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
మరిన్ని వార్తలు