సోనియా, బాబు డ్రామాలను ప్రజలు నమ్మరు

21 Aug, 2013 02:56 IST|Sakshi

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేశామని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెడుతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా ఇవ్వాలని తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఆమరణ నిరాహారదీక్ష మంగళవారానికి రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు చేసిన రాజీనామాలు చెల్లవన్నారు. తనతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశామన్నారు.
 
 రాజీనామాలు చేశామని చెబుతూ, ప్రారంభోత్సవాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆయన దుయ్యబట్టారు. కేవలం తెలుగుతల్లిని, ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. సీఎం కిరణ్,  చంద్రబాబునాయుడు, పురందేశ్వరి, ఎంపీలు, కేంద్ర మంత్రులు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి ఉద్యమానికి తరలిరావాలని డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకుంటే ,నేడు నకిలీ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు సోనియాగాంధీకి మద్దతిచ్చి రాష్ట్ర విభజనకు సహకరించారని ఆరోపించారు.
 
 తెలుగుజాతి తనదని, రాష్ట్రం ఒక్కటిగా ఉండాలన్న ఎన్‌టీ రామారావు కుమార్తెగా పుట్టిన పురందేశ్వరి తన పదవికి రాజీనామా చేసి తెలుగుజాతి గౌరవాన్ని నిలిపి తండ్రికి తగిన కుమార్తెగా నిలవాలన్నారు. నాడు ఇందిరాగాంధీ ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రజాభీష్టం మేరకు రాష్ట్ర విభజన చేయకుండా గొప్ప నాయకురాలిగా నిలిచారన్నారు. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర , రాష్ట్ర మంత్రులు గంగిరెద్దులతో సమానమని ప్రసన్న అభివర్ణించారు. నేడు సోనియాగాంధీ తెలుగుప్రజల రక్తాన్ని తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనానికి రాష్ట్ర విభజన చేస్తోందన్నారు. దీనికి డ్రామాలు వేయడంలో ఆరితేరిన చంద్రబాబునాయుడ్ని ఉపయోగించుకుందన్నారు.
 
 వైఎస్సార్‌సీపీని విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదు
 రాష్ట్ర విభ జన విషయంలో ఏకపక్షం తగదని తొలుత నుంచి వైఎస్సార్‌సీపీ చెబుతూనే ఉందని ప్రసన్న అన్నారు. కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చిన వ్యక్తి అని, అతనిది తెలంగాణ కాదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులను విమర్శించే అర్హత కేసీఆర్‌కు, ఆయన కుమారుడు కేటీఆర్‌కు లేదన్నారు.
 
 దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, పాశం సునీల్‌కుమార్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి ఉన్నారు.
 

మరిన్ని వార్తలు