స్థానికులకు గండికొట్టి.. తమ్ముళ్లకు పంచిపెట్టి..!

7 Aug, 2018 11:14 IST|Sakshi
పాపవినాశనంలో స్థానికుల అంగళ్లు

తిరుమలలో తెలుగు తమ్ముళ్ల హవా

దుకాణాల కేటాయింపులో ఇష్టారాజ్యం

స్థానికులను పట్టించుకోని టీటీడీ

కొత్త లైసెన్సుల కసరత్తు షురూ!

అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లుంది టీటీడీ పరిస్థితి. గతంలో మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఇళ్లు పోగొట్టుకున్న స్థానికులను కాదని అధికార పార్టీకి చెందిన స్థానికేతరులకు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం పాపవినాశనంలో ఉన్న దుకాణాలను తిరుమలకు బదిలీ చేయాలని ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. నేటికీ అది అమలు కాలేదు. ఇప్పుడు కొత్త లైసెన్సుల జారీలో కొందరు అధికారులు, పాలకులు అత్యుత్సాహం చూపుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది.

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల అవసరాల దృష్ట్యా గతంలో స్థానికంగా ఉన్న వారికి దుకాణాలు కేటాయించింది టీటీడీ. మాస్టర్‌ప్లాన్‌లో వాటిని తొలగించారు. వారికి బాలాజీనగర్‌లో వసతి ఏర్పాటు చేశారు. జీవనాధారానికి అవసరమైన దుకాణాలను పాపవినాశనానికి తరలించారు. 15 ఏళ్ల నుంచి వారు అక్కడే వ్యాపారాలు సాగిస్తున్నారు. పాపవినాశనం ప్రాంతం తమ అధీనంలో ఉందంటూ కేంద్ర అటవీశాఖ అధికారులు అడ్డుపుల్ల వేశారు. అప్పటి నుంచి టీటీడీ, అటవీశాఖ అధికారుల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం పాపవినాశనంలోని దుకాణాలను ఖాళీ చేయాలంటూ ఫారెస్ట్‌ అధికారులు హుకుం జారీచేశారు. టీటీడీ అధికారులు జోక్యం చేసుకుని వారితో చర్చలు జరిపారు. నెలవారీ అద్దె చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

నెరవేరని హామీ
పాపవినాశనంలోని దుకాణాలను తిరుమలకు తరలించాలని స్థానికులు గత ఈఓ  సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందించారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లారు. తర్వాత వచ్చిన ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పాపవినాశనంలోని టీటీడీ లైసెన్సులు కలిగిన దుకాణాలను తిరుమలకు బదిలీ చేయాలని రెవెన్యూ విభాగాన్ని ఆదేశించారు. ఇప్పటికి 15 నెలలు కావస్తున్నా నేటికీ అది అమలుకాలేదు.

కొండపై తెలుగు తమ్ముళ్ల హవా..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. అధికారం ఉన్నప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని టీడీపీ నేతలు కొందరు ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగానే వారి కన్ను టీటీడీపై పడింది. తిరుమలలో లైసెన్సులు పొందితే డబ్బులు పుష్కలంగా సంపాదించవచ్చని భావిస్తున్నారు. ఎలాగైనా లైసెన్సులు పొందేందుకు టీటీడీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వందలాది లైసెస్సులు తమ అనుకూలురుకే ఇప్పించాలని హుకుం జారీ చేస్తున్నారు.

భద్రతకు ముప్పు తప్పదా?
స్థానికేతరులకు దుకాణాల లైసెన్సులు కట్టబెడితే టీటీడీకి భద్రత సమస్య తప్పదని విజిలెన్స్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో పనిచేసిన భద్రతా అధికారి రవికృష్ణ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తిరుమలకు ముప్పుతప్పదని రిపోర్టు కూడా ఇచ్చారు. కానీ వాటిని ఇటు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు.

మరిన్ని వార్తలు