బతుకు లేక.. బతకలేక..!

6 Aug, 2019 08:55 IST|Sakshi
కాంగోలో ఆందోళన చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలు

దెబ్బ తగిలి రక్తం కారుతుంటే కట్టు కట్టే నాథుడు ఉండడు. బాధ కలిగి కన్నీరు వస్తుంటే తుడిచే ఆప్తుడు ఉండడు. చెమట్లు కారేలా పనిచేస్తే శ్రమకు తగ్గ వేతనం ఇచ్చే యజమానీ ఉండడు. కాంగోలోని జిల్లా వాసుల పరిస్థితి ఇది. అమ్మానాన్నలను వదిలి, పుట్టి పెరిగిన ఊళ్లను విడిచిపెట్టి దేశాంతరం వెళ్లిన వలస జీవుల బతుకులు కష్టాల అతుకులుగా మారాయి. ఇక్కడేమో బతుకు లేదు.. అక్కడేమో బతకలేరు. కాసిన్ని డబ్బులు సంపాదించడానికి ఎక్కడో ఆఫ్రికాలోని కాంగో వరకు వెళ్లిన ఉద్దానం వాసులు ఆఫ్రికా అడవుల్లో చైనీయుల చేతుల్లో నలిగిపోతున్నారు. తినడానికి తిండి లేక, అండగా నిలబడే మనిషి కనిపించక, ఏం చేయాలో తెలీక వారు నరకయాతన అనుభవిస్తున్నారు.

సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): .ఆఫ్రికాలోని కాంగోలో మగ్గిపోతున్న బాధితుల్లో ఒకరైన కర్ని మల్లేసు తల్లి కర్ని ఆదిలక్ష్మి. వ్యవసాయ కూలీగా ఉన్న ఈమె కన్నీరు మున్నీరవుతూ తనకు గర్భశోకం మిగల్చవద్దని.. కుమారుడిని క్షేమంతా ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు. ఆఫ్రికా అడవుల్లో చైనా వారి చేతిలో చిత్ర హింసలకు గురవుతున్నట్లు తెలిసినప్పటి నుంచి ఆమెకు కంటి మీద కునుకు లేదు. రూ.లక్ష జీతం అని చెబితే ఇచ్ఛాపురంలోని ఏజెంట్‌కు రూ.1.30 లక్షలు చెల్లించి మరీ తన కొడుకు కాంగో దేశానికి వెళ్లాడని, ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో తెలీడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

రక్షణ లేదు.. రప్పించండి
ఈ సందర్భంగా ‘సాక్షి’ కాంగోలో ఉన్న ఉద్దానం గోపినాథపురానికి చెందిన కర్ని మల్లేసు, వెంకటరావులతో వాట్సా ప్‌ కాల్‌ ద్వారా మాట్లాడింది. తమను ఎయిర్‌ పోర్టు నుంచి కాంగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తరలించారని చెప్పారు. అక్కడ ఒక ఇనుప కంటైనర్‌లో 20 మందిని ఉంచుతున్నారని, తినడానికి తిండి లేక, మంచుకే కారిపోతున్న కంటైనర్‌లో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అంతే కాకుండా కాంగోలో ఎబోలా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోందని దీని నుంచి రక్షణ లేకుండా ఉన్నామని తెలిపా రు. ఫోన్‌లో మాట్లాడాలంటే బాత్‌రూమ్‌కు వెళ్లి మాట్లాడాల్సి వస్తోందన్నారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే తెలియని చోటుకు పంపించి గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు.

ఇప్పటికే తమ గ్రామానికి చెందిన మోహనరావు, శేఖరరావులను మరో ప్రాం తానికి తరలించా రని వాపోయారు. కంటైనర్ల చుట్టూ దట్టమైన అడవి నుంచి విష సర్పాలు వచ్చి భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు తాము పనిచేసిన నాలుగు నెలల జీతంతో పాటు పాస్‌పోర్టు ఇప్పించి స్వదేశానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇండియన్‌ ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు కలుగజేసుకుని తమను రక్షించాలని వారు కోరుతున్నారు.

అందం+అపాయం
ఈ గ్రహం మీదే అత్యధిక సహజ ఖనిజాలు గల దేశమది. పది శాతం మందికి మాత్రమే కరెంటు సరఫరా ఉన్న దేశమూ అదే. రెండో ప్రపంచ యుద్ధం ముందు నుంచీ రక్తమోడుతున్న ప్రాంతమది. చేతిలో తుపాకులతో బాలలు కాపలా కాసే దృశ్యాలే అందుకు నిదర్శనం. కాంగో.. ఆఫ్రికా ఖండంలో రెండో అతిపెద్ద దేశం. టిన్, టంగ్‌స్టన్, బంగారం వంటి ఖనిజాలను కడుపులో దాచుకున్న అపురూప ప్రదేశమిది. భూగ్రహం మీదే అత్యధిక ఖనిజాలు కలిగిన దేశంగా కాంగోకు పేరు ఉందంటే అతిశయోక్తి కాదు. రాజధాని కించాసా. డీఆర్‌సీ(డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో) అని ముద్దుగా పిలుచుకుంటారు.

ఏడుకోట్ల పైచిలుకు జనాభా కలిగి ఉంది. దేశంలో 1.8 శాతం మాత్రమే తారురోడ్లు ఉన్నాయి. మిగతావన్నీ మట్టి రోడ్లే. దేశమంతా కాంగో నది ప్రవహిస్తుంది. పెద్ద స్థాయిలో అటవీ ప్రాంతాలు ఉన్నాయి.  కానీ రాజకీయ అస్థిరత్వం కారణంగా ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందలేకపోయారు. ఎయిడ్స్, ఎబోలా వంటి ప్రాణాంతక వ్యాధులు అక్కడ చాలా ఎక్కువగా ప్రబలుతున్నాయి. ఇక్కడకే మన జిల్లా వాసులు వలస వెళ్లి పని పేరుతో చిక్కుకుపోయారు. ఏళ్లుగా జరిగిన అంతర్యుద్ధం, రాజకీయంగా అస్థిరత్వం, చాలా తక్కువ అభివృద్ధి ఈ దేశాన్ని పీడిస్తున్నాయి.

కాంగోలో చిక్కుకున్న ఉద్దానం గోపినాథపురానికి చెందిన కర్ని వెంకటరావుది విషాద గాథ. పెట్టిందే తినా లంటూ వెట్టి చాకిరీ చేయించి ఎదురు తిరిగితే చైనీయులు హింసకు గురి చేస్తున్నారని అతని తల్లి కర్ని రమణమ్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఏజెంట్‌ ఒకడు రూ.లక్ష జీతం అని నమ్మించి తన కుమారుడిని మోసం చేశాడని తెలిపారు. అప్పు చేసి రూ.1.30లక్షలు చెల్లించామని కానీ ఏజెంట్‌ చెప్పిన మాటలన్నీ అబద్ధమేనని అక్కడకు వెళ్లాక తెలిసిందని ఆమె చెప్పారు. తిండి పెట్టక ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పని చేయించి నాలుగు నెలలు గడుస్తున్నా జీతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిందే తినాలని, చిన్న ఇనుప కంటైనర్‌లో 20 మందిని ఉంచి అందులోనే నిద్రపోవాలని హెచ్చరిస్తున్నారని తన కుమారుడు ఫోన్‌లో చెప్పాడంటూ కన్నీరు మున్నీరై చెబుతున్నారు. ఎలాగైనా తన కుమారుడిని తిరిగి మన దేశానికి తీసుకురావాలని ఆమె కోరుతున్నారు.

చేతులెత్తేసిన గుజరాత్‌ ఏజెంట్‌
ఆదివారం ముంబై ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఉద్దానం గోపినాథపురానికి చెందిన కర్ని జోగారావు, నౌపడకు చెంది న బొమ్మాళి దామోదర్, మరో నలుగురు బీహార్‌ యువకులు కలిసి అక్కడ నుంచి గుజరాత్‌ చేరుకుని ప్రధాన కార్యాలయంలోని ఏజెంట్‌ అజయ్‌ సింగ్‌తో చర్చించా రు. జీతం ఇప్పించాలని, లేకుంటే తాము కట్టిన రూ.1.30 లక్షలు తిరిగి ఇవ్వాంటూ డిమాండ్‌ చేశారు. అక్కడ చైనీయుల వద్ద రక్షణ లేకుండా చిత్ర హింసలకు గురవుతున్న శ్రీకాకుళానికి చెందిన వలస కూలీలను రప్పించాలని కోరా రు. దీంతో ఆయన రోజుకు ఐదుగురిని చొప్పున మూడు నాలుగు రోజుల్లో సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, నరసన్నపేట, ప్రాంతాలకు చెందిన వారిని తీసుకొచ్చే బాధ్యత తనదని చెప్పారు. ముంబైలో అధిక వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టుకు విమానాల రాకను నిలిపివేయడంతో ఈ నెల 15 తర్వాత వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపినాథపురం, చిన్న మురహరిపురానికి చెందిన వారిని పంపించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని జోగారావు ‘సాక్షి’కి చెప్పారు.

ఇక పోతే జీతం, కట్టిన సొమ్ముపై నిలదీయగా ఆ గుజరాతీ ఏజెంట్‌ తనకు సం బంధం లేదంటూ చేతులెత్తేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారో ఆ ఏజెంట్‌ను అడిగి తీసుకోవాలని, కాంగో నుంచి జీతాలు అందితే నేరుగా మీకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి వెళ్లిపోడని చర్చలు జరిపిన జోగారావు ‘సాక్షి’కి చెప్పారు. ఆ తర్వాత తాము గుజరాత్‌ నుంచి బయల్దేరామని, మంగళవారం నాటికి చేరుకుని విశాఖపట్నంలోని మణికంఠ వెల్డింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఏజెంటును కలిసి పరిస్థితిపై చర్చిస్తామని చెప్పారు. జీతం లేదా, తాము కట్టిన సొమ్ము తిరిగి ఇప్పించకుంటే ఊరుకునేది లేదని జోగారావు, దామోదర్‌ తేల్చి చెబుతున్నారు.

కుటుంబం కన్నీరుమున్నీరు
కంచిలి: సౌత్‌ ఆఫ్రికా దేశం కాంగోలో చిక్కుకున్న జిల్లాకు చెందిన యువకుల బృందంలో కంచిలి మండలం ముండ్ల పంచాయతీ పరిధి జె.జిల్లుండ గ్రామానికి చెందిన యువకుడు బెస్త అజిత్‌ ప్రధాన్‌ కూడా ఉన్నాడు. అక్కడ ఉద్యోగానికి వెళ్లి మోసపోయిన బాధిత యువకులు రహస్యంగా పంపించిన వీడియో క్లిప్పింగ్‌లో అజిత్‌ ప్రధాన్‌ కూడా తన గోడును వెళ్లగక్కడంతో ఆ వీడియో స్థానికంగా వైరల్‌ అయ్యింది. సుమారు మూడు నెలల కిందట మండలంలోని పి.శాసనాం గ్రామానికి చెందిన ఒక మధ్యవర్తి సహకారంతో విశాఖపట్నం ఆటోనగర్‌లో గల ఒక ఏజెన్సీ ద్వారా రూ.1.5లక్షలు డబ్బులు చెల్లించినట్లు బాధిత యువకుడు, కుటుంబ సభ్యులు వెల్లడించారు. కానీ చెప్పినదానికి విరుద్ధంగా కాంగో అడవుల్లో ప్రమాదకరమైన ప్రదేశంలో రక్షణలేని చోట పని ఇచ్చారని, మొదటి నెల మాత్రమే జీతం ఇచ్చి, తర్వాత నెలల్లో ఇవ్వలేదని, తీరా అడిగితే కొడుతున్నారని వాపోయారు.

ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌ వ్యాపించడంతో భయాందోళన చెందుతున్నామని తెలిపారు. పని వద్ద సహచరులుగా ఉన్న చైనా, కాంగో వాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, కొడుతున్నారని చెప్పారు. తనను ఇండియాకు తిరిగి రప్పించాలని కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక విలేకర్ల బృందం సోమవారం అజిత్‌ ప్రధాన్‌ స్వగ్రామం జె. జిల్లుండకు వెళ్లడంతో, ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కనిపించింది. బా«ధిత యువకుడు తండ్రి సుదర్శన్‌ ప్రధాన్‌ తన కుమారుడిని కాపాడాలంటూ తెలిసిన వాళ్లందరి వద్దకు వెళ్లి కోరుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇంటి వద్ద ఉంటున్న యువకుని నాన్నమ్మ శశిప్రధాన్‌ కన్నీళ్లపర్యంతమై తన మనవడిని కాపాడాలంటూ కోరింది. ఇంటి వద్ద ఉంటున్న యువకుని తల్లిదండ్రులు భారతి, సుదర్శన్‌ ప్రధాన్‌లోపాటు నాన్నమ్మ శశప్రధాన్, మిగతా బంధువర్గం ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు