ఎస్పీ ఇంటివద్ద రెక్కీ ?

2 Jan, 2015 03:44 IST|Sakshi

 పెనమలూరు (కృష్ణా): యవాడ శివారులోగల కానూరులోని ఓ పోలీసు ఉన్నతాధికారి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గురువారం వేకువజామున రెక్కీ నిర్వహించారు. అయితే వీరు దొంగతనానికి వచ్చారా? లేక ఏదైనా చర్యకు పాల్పడటానికా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఇల్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీది కావడంతో ఆయన కుటుంబసభ్యులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానికులు, ఎస్పీ కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు విజయవాడ శివారులోని కానూరు గ్రామంలోగల సనత్‌నగర్‌లో మూడంతస్తుల భవనం ఉంది. ఖాన్ భార్య నసీం, తల్లి రహీమున్నిసా, కుటుంబసభ్యులు ఈ భవనంలోని వివిధ పోర్షన్లలో ఉంటున్నారు.
 
 గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు ముఖాలకు వస్త్రాలు కట్టుకుని బైక్‌లపై ఖాన్ ఇంటికి వచ్చారు. లోనికి చొరబడి తలా ఒక అంతస్తులో కలియదిరిగారు. రెండో అంతస్తులో ఎస్పీ భార్య ఉంటున్న పోర్షన్ తలుపు గడియ ఊడబెరికేందుకు యత్నించారు. ఆ అలికిడికి ఎదురింట్లో ఉన్న వారికి మెలకువ వచ్చి బయటకు వచ్చారు. వారిని చూసి గుర్తుతెలియని వ్యక్తులు హడావుడిగా వెళ్లిపోయారు. దీంతో ఎదురింటివారు ఎస్పీ భార్యను లేపి, ఈ విషయాన్ని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులను పిలిచి, తన పోర్షన్ తలుపును పరిశీలించారు. తలుపునకు వేసిన గడియ ఊడిపోయి ఉండటాన్ని గుర్తించి, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురించి తెలియడంతో స్థానికులు వచ్చి ఎస్పీ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
 
 రెక్కీయా...? దొంగతనానికి యత్నమా..?
 కాగా ఇంట్లోకి ఆరుగురు వ్యక్తులు చొరబడ్డారని తెలుసుకుని ఎస్పీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇంట్లోని అన్ని పోర్షన్లలో అందరూ ఉండగా వచ్చినవారు దొంగతనం ఎలా చేయగలరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దొంగతనాలు చేయడం అంత తేలిక కాదని స్థానికులు అంటున్నారు. ఆగంతకులు రెక్కీ నిర్వహించటానికి వచ్చారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అందుకోసమే అయితే దానికి కారణాలు ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ మమ్మరం చేస్తే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు