నేటి నుంచి ఉపమాకలో బ్రహ్మోత్సవాలు

5 Oct, 2013 02:48 IST|Sakshi

నక్కపల్లిన్యూస్‌లైన్: ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాకలో వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శని వారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఉపమాకలో నేత్రపర్వంగా జరుగుతాయి. తిరుపతిలో మాదిరిగా ఇక్కడ కూడా ఏటా కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవా లు, ధనుర్మాసోత్సవాలను  దేవాదాయశాఖ ఘనంగా నిర్వహిస్తుంది. బ్రహ్మోత్సవాల్లో బాగంగా శని వారం రాత్రి అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

ఆదివారం (6వతేదీ) మధ్యాహ్నం ధ్వజారోహణ, రాత్రి తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఆలయంలో ధ్వజ స్తంభం వద్ద ధ్వజ పటాన్నిఎగురవేసి అష్టదిక్పాలకులను  బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే కార్యక్రమంజరుగుతుంది. ఏడు నుంచి 14 వరకు ఉదయం, రాత్రి స్వామివారికి తిరువీది సేవలు నిర్వహిస్తారు. తిరువీధి సేవల్లో బాగంగా శ్రీదేవి,భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని వివిధ వాహనాల్లో ఉంచి ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న ఇత్తడి గరుడవాహనంపై స్వామికి తిరువీధి సేవ జరుగుతుంది.

12 రాత్రి రథోత్సవం సందర్భంగా స్వామిని, అమ్మవార్లను పుణ్యకోటి వాహనంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు.13న సాయంత్రం మృగయా వినోదం కార్యక్రమం అనంతరం గజవాహనంపై తిరువీధి సేవ చేస్తారు. ఈరోజే విజయదశమి కావడంతో శమీపూజ నిర్వహించిన అనంతరం పుణ్యకోటి వాహనంపై తిరువీధి నిర్వర్తిస్తామని ప్రధానార్చకుడు వరప్రసాద్ చెప్పారు. 14న మధ్యాహ్నం పూర్ణాహుతి, వినోదోత్సవం, ఆపై స్వామివారి చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శేఖర్‌బాబు తెలిపారు.
 

మరిన్ని వార్తలు