వైఎస్సార్‌సీపీలోకి వేమిరెడ్డి

5 Dec, 2013 03:43 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సేవా రంగంలో తనకు తానే సాటి అని పేరు తెచ్చుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజకీయరంగంలోకి అడుగుపెట్టారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం చెన్నైలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
 
 దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  ప్రవేశపెట్టిన పథకాలను జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అమలు చేయగలరనే విశ్వాసం వైఎస్సార్‌సీపీ వైపు వేమిరెడ్డిని నడిపించాయి. సేవానిరతి కలిగిన ఆయన రాజకీయ ప్రవేశం ద్వారా ప్రజలకు విసృ్తతంగా సేవలందించాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. చెన్నైలో వైఎస్ అనిల్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పార్టీకి చెందిన ముఖ్యులందరూ హాజరై వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. విజయాలు సాధించే మనిషిగా కాదు, విలువలతో జీవించే మనిషిగా వర్థిల్లు అనే భావనతో అందరికి ఆదర్శంగా ఉంటున్న వేమిరెడ్డి సేవా కార్యక్రమాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.
 
 నెల్లూరు నగరంలోని బోడిగాడితోట శ్మశాన వాటికను స్వర్గధామంలా నిర్మించడంలో ప్రభాకర్‌రెడ్డి ప్రధాన దాతగా వ్యవహరించి నగర ప్రజల మన్ననలు పొందారు. నగరంలో బెజవాడగోపాల్‌రెడ్డి, అన్నమయ్య, ఘంటసాల, జ్యోతిరావ్ పూలే వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అనాథలు, వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్న వాత్సల్య సంస్థకు భూరి విరాళంతో సహకరించి ప్రతిఏటా ఒక మాసం వారికి అయ్యే భోజన ఖర్చులు భరిస్తున్నారు. నగరంలోని అన్నపూర్ణేశ్వరి వృద్ధాశ్రమం, ప్రగతి చారిటీస్, ఇస్కాన్ టెంపుల్ వంటి ధార్మిక సంస్థలకు విస్తృతంగా విరాళాలు అందచేశారు. ఉన్నత ఆశయాలు కలిగిన ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.
 
 పారిశ్రామిక రంగం నుంచి రాజకీయ రంగం వైపు
 బాల్యంలో రిషీవాలీ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ప్రభాకర్‌రెడ్డి చెన్నైలోని ప్రముఖ కళాశాల నుంచి ఆర్థికశాస్త్ర పట్టాను పొందారు. విద్యాభ్యాసం తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించారు. ఇక్కడ తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లోనూ కాంట్రాక్టులు చేస్తూ జిల్లాకు చెందిన ఎంతో మందికి ఉపాధి కల్పించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేద, బడుగు, బలహీన వర్గాలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. దీంతో ఆయన సేవారంగం వైపు మొగ్గుచూపి దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు