వైద్యులూ.. ఇదేం తీరు.!

3 Mar, 2020 08:21 IST|Sakshi
ఉదయం 11 గంటలకు రోగుల క్యూలు (ఇన్‌సెట్‌)లో 11 గంటలైనా వైద్యులు రాకపోవడంతో ఖాళీగా ఉన్న గది 

కేజీహెచ్‌ చర్మవ్యాధుల విభాగంలో కొరవడిన సమయ పాలన 

11 గంటల తరువాత విధులకు హాజరు 

రోగులకు తప్పని పడిగాపులు 

పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణం): కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల ఓపీ విభాగంలో వైద్యుల తీరుతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సమయ పాలన పాటించకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. క్యూలో నిల్చోలేక నీరసించిపోతున్నారు.   ఈ విభాగం ఓపీ సేవలందించే బ్లాకు రెండో అంతస్తులో ఉంది. ఈ ఓపీకి సగటున రోజుకు 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. వీరంతా ఉదయం 8.30 గంటలకే ఓపీ చీటీ రాయించుకుని పడుతూ లేస్తూ రెండో అంతస్తుకు చేరుకుని క్యూలైన్లో కూర్చుంటారు. వైద్యుడు రాగానే చూపించుకుని అవసరమైన మందులు తీసుకుని ఎండకు చిక్కకుండా ఇంటికి చేరుకోవాలని ప్రతి రోగి మనసులో అనుకుంటాడు. కానీ అది ఆచరణ సాధ్యం కావడం లేదు.

ఉదయం 9 గంటలకు ఓపీకి వచ్చి వైద్య పరీక్షలు చేయాల్సిన వైద్యులు 10.30 దాటితే కాని రావడం లేదు. ముఖ్యంగా పురుషుల ఓపీకి వచ్చే వైద్యులు ఆలస్యంగా రావడంతో రోగులు క్యూలైన్లో పడిగాపులు పడాల్సి వస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వైద్యులు రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ మండిపోతుండడంతో చర్మవ్యాధులతో వచ్చే రోగులు ఎక్కువ సేపు కూర్చోలేకపోయారు. క్యూలైన్‌లో ఎక్కువ మంది ఉండడంతో వైద్య పరీక్షలు చాలా ఆలస్యంగా జరిగాయి. పరీక్షల అనంతరం మందుల కోసం చాంతాడంత లైన్‌లో నిల్చున్నారు. వృద్ధులు, పిల్లలను ఎత్తుకుని వచ్చే మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజు సకాలంలో ఓపీని తెరవాలని పలువురు కోరుతున్నారు. 

ఉదయం నుంచి క్యూలో ఉన్నా.. 
ఉదయం 8.30 గంటలకు వచ్చి క్యూలో కూర్చున్నాను. ఎండ వేడి పెరిగిపోవడంతో కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. 9 గంటలకు రావలసిన వైద్యులు 11 గంటలు దాటిన తర్వాత వచ్చారు. ప్రతి రోజు ఉదయాన్నే వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తే రోగులకు వెసులుబాటుగా ఉంటుంది. 
– ఎస్‌.అప్పలరాజు, గాజువాక 

రెండంతస్తులు ఎక్కడం కష్టమే.. 
వైద్యం కోసం రెండంతస్తులు కష్టపడి ఎక్కాక.. అక్కడ వైద్యులు లేకపోతే ప్రాణం ఉసూరుమంటుంది. వైద్యులు వచ్చే వేళకు లైను కూడా పెరిగిపోతోంది. వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత మందులు చీటీ తీసుకుని మందులు ఇచ్చే లైన్‌లో నిల్చోవాలి. వైద్యులు ఉదయాన్నే వస్తే బాగుంటుంది. 
– ఎస్‌.మల్లేష్, మధురవాడ 

మరిన్ని వార్తలు