ఆఖరి ప్రయాణం

10 Mar, 2018 13:12 IST|Sakshi
ప్రయాణంలో అనారోగ్యం తో మృతి చెందిన మహిళ

రైల్లో విజయనగరం నుంచి విశాఖ వస్తూ తీవ్ర అస్వస్థత

వైద్య నిమిత్తం పెందుర్తి రైల్వేస్టేషన్‌లో దించిన సిబ్బంది

108లో తరలిస్తుండగా మార్గ మధ్యలో  మరణించిన మహిళ

పెందుర్తి: ఓ అభాగ్యురాలి రైలు ప్రయాణం.. ఆఖరి ప్రయాణంగా మారింది. విధి కన్నెర్రజేయడంతో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. విజయనగరం నుంచి విశాఖపట్నానికి రైల్లో వస్తున్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతతో మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ టి.కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం విజయనగరం నుంచి విశాఖ వస్తున్న ఓ పాసింజర్‌ రైల్లో విజయనగరం స్టేషన్‌ వద్ద కొత్తపల్లి పార్వతి(42) ఎక్కింది. పెందుర్తి స్టేషన్‌ వద్దకు వచ్చే సరికి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె రైల్లోనే కుప్పకూలిపోయింది. రైలు గార్డు స్పందించి ఆమెను స్టేషన్‌లో దించారు.

108 వాహనంలో ఆస్పత్రికి తరలిం చాల్సిందిగా స్టేషన్‌ సిబ్బందికి సూచించారు. తక్షణమే స్పందించిన సిబ్బంది 108 వాహనాన్ని రప్పించి కేజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ముందుగా గుర్తు తెలియని మహిళగా కేసు దర్యాప్తు ప్రారంభించిన జీఆర్పీ పోలీసులు వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె ఫోటో ఉంచారు. మరోవైపు విజయనగరం జీఆర్పీ వాట్సాప్‌ గ్రూప్‌లో పార్వతి అనే మహిళ కనిపిం చడం లేదని ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ గ్రూపులో ఉన్న కామేశ్వరరావు ఇది గుర్తించారు. ఇక్కడ మరణించిన మహిళ..ఆ ఫొటో ఉన్న మహిళ పోలికలు ఒక్కటే కావడంతో ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సాయంత్రం బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనారోగ్యమో..మతి స్థిమితం లేకనో.. మరే ఇతర కారణంతోనో ఆమె ఇంటి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు