`ఉద్యమం ముసుగులో దాడులు సహించం`

17 Sep, 2013 02:42 IST|Sakshi
`ఉద్యమం ముసుగులో దాడులు సహించం`

సాక్షి, హైదరాబాద్: సమైక్యోద్యమం ముసుగులో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేది లేదని ఉద్యోగ సంఘాలను, జేఏసీలను సీమాంధ్రకు చెందిన మంత్రులు హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే తాము రాజీనామాలు చేయడం లేదని స్పష్టంచేశారు. సమైక్యోద్యమానికి సంబంధించి కాంగ్రెస్ కార్యాచరణను త్వరలోనే పార్టీ సీమాంధ్ర నేతల విస్తృతస్థాయి భేటీలో రూపొందిస్తామన్నారు. మంత్రుల క్వార్టర్లలో మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సోమవారం సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. గంటాతో పాటు శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, కాసు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సమైక్యోద్యమంలో పాల్గొనే క్రమంలో ఉద్యమకారుల నుంచి ఇటీవల తమకు ఎదురవుతున్న చేదు ఘటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయన్నారు. వాటిని అధిగమించి ప్రజల్లోకి వెళ్లే మార్గాలపై మల్లగుల్లాలు పడ్డారు. హైదరాబాద్‌లో ఉంటూ ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని, వాటన్నింటినీ డ్రామాలుగానే భావిస్తుందున క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని అభిప్రాయపడ్డారు.
 
 ఈ విషయమై 2 రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విస్తృతస్థాయి భేటీ ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు, ఎంపీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. సమైక్యం కోసం తొలి నుంచి పోరాడుతున్న తనను అడ్డుకున్న నేతలు, రాయలసీమను రాష్ట్రం చేయాలంటున్న బెరైడ్డి రాజశేఖరరెడ్డి తదితరులను ఎందుకు అడ్డుకోవడం లేదని టీజీ ప్రశ్నించారు. రౌడీ మూకలు ఉద్యమంలోకి చొరబడి తనపై దాడి చేశాయని ఆరోపించారు. ఉద్యమం ముసుగులో కొందరు కాంగ్రెస్‌పై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని పితాని అన్నారు. సమైక్యత కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ సీమాంధ్ర నేతలేనని శైలజానాథ్ పేర్కొన్నారు. తాము హైదరాబాద్‌లో ఖాళీగా కూర్చోలేదని, సీమాంధ్రకు నష్టం జరగకుండా ఎలా నడవాలన్న దానిపై పోరాడుతున్నామని ఏరాసు అన్నారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినందునే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావే ప్రకటించారని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు