వాహ్..విశాఖ

30 May, 2016 06:28 IST|Sakshi
వాహ్..విశాఖ

- టాప్‌టెన్ మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో విజయవాడకు దక్కని చోటు
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నివేదికలో వెల్లడి
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిన పది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాలో విశాఖపట్నం కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తాత్కాలిక రాజధాని విజయవాడ చోటు దక్కించుకోలేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నగరం నుంచే పరిపాలన నడిపిస్తున్నా పరిస్థితిలో మార్పురాలేదు. సేవలు, సౌకర్యాల్లో చిన్న పట్టణాల స్థాయిని కూడా విజయవాడ అందుకోలేకపోయింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 97 మున్సిపాలిటీల్లో టాప్ టెన్ జాబితాను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ప్రకటించింది.

అందులో విశాఖపట్నం కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలవగా, అనంతపురం జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ రెండో స్థానంలో, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో గుంటూరు కార్పొరేషన్, ఐదో స్థానంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, ఆరో స్థానంలో నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, ఏడో స్థానంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఎనిమిదో స్థానంలో తూర్పుగోదావరిలోని అమలాపురం, తొమ్మిదో స్థానంలో ప్రకాశం జిల్లా చీరాల, పదో స్థానంలో అనంతపురం జిల్లాలోని గుంతకల్ నిలిచాయి. 11 అంశాలకు వంద మార్కులిచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన టాప్ పది మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. విశాఖపట్నం కార్పొరేషన్‌కు 53.09 శాతం మార్కులురాగా, హిందూపురం మున్సిపాలిటీకి 50.88, కొవ్వూరు మున్సిపాలిటీకి 49.94 మార్కులొచ్చాయి.

 సేవలు, సౌకర్యాలు చెత్తే..
 తాత్కాలిక రాజధాని వీటి స్థాయిని కూడా అందుకోలేక చతికిలబడింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం, ఆస్తి పన్ను వసూళ్లు, సిటిజన్ చార్టర్ అమలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిష్కరించడం, ఆర్థిక పరిస్థితి, స్కూళ్లలో ఐఐటీ ఫౌండేషన్, వ్యక్తిగత, ఉమ్మడి మరుగుదొడ్ల ఏర్పాటు-నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు నిర్వహణ, టౌన్‌ప్లానింగ్ కార్యకలాపాలు, డ్వాక్రా గ్రూపులకు రుణాలు, స్కిల్ డెవలప్‌మెంట్, గ్రీనరీ ఏర్పాటులో పని తీరును బట్టి మార్కులిచ్చారు. ఈ అంశాల్లో దేనిలోనూ విజయవాడ కార్పొరేషన్‌కు మార్కులు వచ్చే పరిస్థితి లేదు.

చెత్త నిర్వహణ అధ్వానంగా తయారవడంతో స్థానికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజ్ఞప్తుల పరిష్కారంలోనూ కార్పొరేషన్ బాగా వెనుకబడింది. మిగిలిన అన్ని విషయాల్లోనూ అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణం. మొన్నటివరకూ జీతాలిచ్చే పరి స్థితి కూడా లేదు. అన్నింట్లో వెనుకబడిన తాత్కాలిక రాజధాని టాప్‌టెన్ జాబితాలో చోటు దక్కించుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు