చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు

22 Jul, 2018 12:55 IST|Sakshi

ప్రత్యేకహోదాను చంద్రబాబు ప్రస్తావించలేదన్న ప్రధాని

24న నిర్వహించే బంద్‌కు ప్రజలందరు సహకరించాలి

మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌ బాషా

కడప అగ్రికల్చర్‌ : సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్లమెంటు సభ్యులు ఇంత కాలం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారని నిన్న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం మోసాలను బట్టబయలు చేశారని కడప మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా ద్వజమెత్తారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ పార్లమెంటులో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సందర్భంలో ప్రధాని చేసిన ప్రసంగంలో సీఎం చంద్రబాబు నాయుడు  ఏనాడు ప్రత్యేక హోదా విషయం పై పటుబట్టలేదని, పైగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే మం చిదని ఒప్పుకున్నారని అనడంతోనే సీఎం అసలు నైజం బయటపడిందన్నారు.

 రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా సీఎం, ఆ పార్టీ ఎంపీలు నాటకా లాడుతూ వస్తున్నారని నిప్పులు చెరిగారు.  పార్లమెంటులో ప్రధాని మోదీ  చంద్రబాబునాయుడు మోసాలను  ఎండగట్టారన్నారు.  ప్రజల్లో వ్యతిరేకత రావడంతోనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా నినాదాన్ని జపిస్తున్నాడని మోదీ తూర్పారపట్టిన విషయం నిజం కాదా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ–బీజేపీ పార్టీల బంధం ధృడమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ పార్లమెంటు సాక్షిగా నిండు సభలో చెప్పిన విషయం రాష్ట్ర ప్రజలందరు విన్నారని అన్నారు. మరి ఎవరు ఎవరితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారో ప్రజల ముందుకు వచ్చి టీడీపీ నాయకులు ధైర్యంగా చెప్పగలరా? అని అడిగారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈనెల 24న బంద్‌ నిర్వహిస్తున్నామని, ఈ బంద్‌కు ప్రజలందరి సహకరించి బీజేపీ బుద్ధి వచ్చేలా చేయాలని కోరారు.

 ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా  మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం అనుమతి అవసరం లేదని తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్న విషయాలన్నారు.  ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు, విభజన చట్టం అమలు చేయాలని శాసన సభలో చేసిన తీర్మానాలనే ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు వల్లె వేశారే తప్ప చేసిందేమీ లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో మద్దతు తెలపాలని ప్రతిపక్షనేతలకు లేఖలు రాశామని సీఎం  గొప్పలు చెప్పారని, తీరా అవిశ్వాస తీర్మానంలో ఒకటి, రెండు పార్టీ కూడా అనుకూలంగా మాట్లాడలేదని ఆరోపించారు. తమ పార్టీ ఎంపీలు చిత్తశుద్ధితో నాడు రాజీనామాలు చేస్తే అవహేళన చేసిన సీఎం నేడు అవిశ్వాస తీర్మానం పెట్టించి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పులి సునిల్‌కుమార్, పార్టీ మైనార్టీ నగర అధ్యక్షుడు  షఫీ,  రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు