ఖాయిలా పీఎస్‌యూల మూసివేత వేగవంతం

7 Jun, 2018 00:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఖాయిలాపడిన, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) మూసివేతకు, వాటి స్థిర.. చరాస్తుల విక్రయానికి నిర్దిష్ట కాలవ్యవధులు నిర్దేశించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను బుధవారం ఆమోదించింది. నష్టాల్లోని పీఎస్‌యూల మూసివేత ప్రణాళికల అమల్లో జాప్యాన్ని తగ్గించేందుకు ఇవి తోడ్పడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

మార్గదర్శకాల ప్రకారం మూతబడే పీఎస్‌యూల స్థలాల వినియోగానికి సంబంధించి ముందుగా అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం లభిస్తుంది. అలాగే, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రస్తుతం ఏ పేస్కేల్‌లో ఉన్నప్పటికీ... 2007 నాటి నోషనల్‌ పే స్కేల్‌ ఆధారంగా సిబ్బంది అందరికీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం వర్తింపచేసేలా ప్రభుత్వం ఏకీకృత విధానం రూపొందించింది.   

మరిన్ని వార్తలు