విమానంలో కొలీగ్‌ చెంప చెళ్లుమనిపించాడు

23 Mar, 2018 15:24 IST|Sakshi
ఎయిరిండియా (ఫైల్‌ ఫోటో)

ముంబై : వరుస వివాదాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఎయిరిండియా క్యాబిన్‌కు చెందిన ఓ క్రూ సభ్యుడు, తన జూనియర్‌ కొలిగ్‌ చెంప చెల్లుమనిపించాడు. దీనికి గల కారణం ఆన్‌బోర్డులో ఉన్న శాకాహార ప్రయాణికుడికి, మాంసాహార భోజనం అందజేయడమే. ఈ సంఘటన న్యూడిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే విమానంలో చోటు చేసుకుంది. 

మార్చి 17న ఈ సంఘటన చోటు చేసుకుందని, దీనిపై అంతర్గత విచారణ ప్రారంభించినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. కేబిన్‌ అటెండెంట్‌ అయిన అమ్మాయి పొరపాటున న్యూఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్‌ విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికుడికి శాకాహార భోజనం బదులు మాంసాహార భోజనం అందించింది. ఈ పొరపాటును గుర్తించిన ప్రయాణికుడు, క్యాబిన్‌ సూపర్‌వైజర్‌కు సమాచారం అందించాడు. కానీ ఎలాంటి ఫిర్యాదును దాఖలు చేయలేదు. తర్వాత ఆ అమ్మాయి, ప్రయాణికుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కూడా కోరింది. ఆ భోజనాన్ని మార్చి వేరే భోజనాన్ని అందించింది. 

కానీ మరోసారి క్రూ సూపర్‌వైజర్‌ ఈ పొరపాటును రచ్చరచ్చ చేసి, ఆ అమ్మాయి చెంప చెల్లుమనిపించాడు. కానీ దీనిపై ఏ మాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా.. ఆ అమ్మాయి మొత్తం ఘటనపై ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్‌ సర్వీసు డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది. తమకు న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్‌ వెళ్లే విమానం ఏఐ 121 కేబిన్‌ క్రూ నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు