యాక్సిస్‌ బ్యాంక్‌కు కొత్త సీఈవో..

8 Sep, 2018 19:44 IST|Sakshi
యాక్సిస్‌ బ్యాంక్‌ ​కొత్త సీఈవో, ఎండీ అమితాబ్‌ చౌదరి

ముంబై : యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో కొత్త సీఈవో, ఎండీ దొరికేశారు. యాక్సిస్‌ బ్యాంక్‌ ​కొత్త సీఈవో, ఎండీగా అమితాబ్‌ చౌదరిని మూడేళ్ల పాటు నియమిస్తున్నట్టు యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. బొంబై స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో నమోదు చేసిన ఫైలింగ్‌ ఈ విషయాన్ని బ్యాంక్‌ వెల్లడించింది. ‘నేడు జరిగిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల మీటింగ్‌లో 2019 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు అంటే మూడేళ్ల పాటు అమితాబ్‌ చౌదరిని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా నియమించాలని నిర్ణయించాం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా దీనికి ఆమోదం తెలిపింది’ అని బ్యాంక్‌ తెలిపింది. ఈ నియామకం, రెమ్యునరేషన్‌ నియమ, నిబంధనల ప్రకారం ఉంటుందని పేర్కొంది. 

అమితాబ్‌ చౌదరి ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో పనిచేస్తున్నారు. 2010లో ఆయన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో చేరారు. లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌కు చేరువలో దేశంలో అత్యంత విలువైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఉంది. ప్రస్తుతం యాక్సిస్‌ బ్యాంక్‌కు సీఈవో, ఎండీగా ఉన్న శిఖా శర్మ పదవి కాలం ఈ ఏడాది  చివరి నాటికి ముగియనుంది. ఈ పోస్టు కోసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను బ్యాంక్‌, ఆర్‌బీఐ వద్దకు పంపింది. వారిలో అమితాబ్‌ చౌదరిని ఈ పదవి వరించింది. చౌదరి బిట్స్‌ పిలానీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో చేరకముందు ఇన్ఫోసిస్‌ బీపీవో పనిచేశారు. 1987లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆసియాకు టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ హెడ్‌, హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌కు, గ్లోబల్‌ మార్కెట్లకు రీజనల్‌ ఫైనాన్స్‌ హెడ్‌గా, చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌గా పదవులు చేపట్టారు. 
 

మరిన్ని వార్తలు