చైనాలో అరబిందో తయారీ ప్లాంట్లు 

12 Dec, 2018 01:28 IST|Sakshi

షాన్‌డాంగ్‌తో భాగస్వామ్య సంస్థ ఏర్పాటు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ అయిన నెదర్లాండ్స్‌లోని హెలిక్స్‌ హెల్త్‌కేర్, చైనాకు చెందిన షాన్‌డాంగ్‌ లువోక్సిన్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌ ఓ ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా జాయింట్‌ వెంచర్‌ సంస్థను పెట్టి... దీనిద్వారా చైనాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒప్పందం ప్రకారం జేవీ కంపెనీలో హెలిక్స్‌కు 30 శాతం వాటా ఉంటుంది. జేవీ ద్వారా ఇరు సంస్థలూ నెబ్యులైజర్‌ ఇన్‌హేలర్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తాయి.

కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌లోకి సైతం ప్రవేశిస్తాయి. ఈ ఉత్పత్తులను చైనాతోపాటు యూఎస్, యూరప్‌ మార్కెట్లలో విక్రయిస్తారు. జేవీ వర్కింగ్‌ క్యాపిటల్‌తో కలిపి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.360 కోట్లు. ఈ మొత్తం పెట్టుబడిలో 30 శాతాన్ని హెలిక్స్, మిగిలిన మొత్తాన్ని లువోక్సిన్‌ దశలవారీగా పెడతాయి. 2021లో తయారీ ప్రారంభం అవుతుంది. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో అరబిందో షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.44 శాతం అధికమై రూ.736.35 వద్ద స్థిరపడింది.    

మరిన్ని వార్తలు