‘సర్కార్‌ ఖజానాకు రూ లక్ష కోట్ల రాక’

28 Jun, 2019 12:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సర్కార్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ డివిడెండ్‌ను ఆర్‌బీఐ త్వరలో ప్రభుత్వానికి బదిలీ చేయనుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఆర్‌బీఐ మిగులు నిల్వల నిర్వహణపై కీలక కమిటీ సిఫార్సులు బహిర్గతం కాకముందే కేంద్రానికి ఆర్‌బీఐ నుంచి రూ లక్ష కోట్లు రానున్నాయని డచ్‌ బ్యాంక్‌ అంతర్గత నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్‌బీఐ భారత ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ ఇవ్వనుందని డచ్‌ బ్యాంక్‌ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ కౌశిక్‌ దాస్‌ ఈ నివేదికలో పేర్కొన్నారు.

ఆర్‌బీఐ నుంచి సమకూరే రూ లక్ష కోట్లను ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు బడ్జెట్‌లో వివిధ పద్దుల కింద పొందుపరిచే వ్యయాలకు వెచ్చిస్తారని నివేదిక పేర్కొంది. ఆర్‌బీఐ నిధుల ఊతంతో రానున్న బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణ మౌలిక ప్రాజెక్టులు, విద్య, వైద్యం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిధుల కేటాయింపు పెంచుతారని కౌశిక్‌ దాస్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ మిగులు నిల్వలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో పన్నేతర రాబడిని పెంచే అవకాశం ఉందని డచ్‌ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది. మరోవైపు ఆర్‌బీఐ వద్ద పోగుపడిన మిగులు నిధుల వినియోగంపై బిమల్‌ జలాన్‌ కమిటీ సమర్పించనున్న నివేదిక కూడా ఈ నిధుల వినియోగంలో కీలకం కానుంది.
 

మరిన్ని వార్తలు