భారత ఆర్థిక వ్యవస్థ అసంఘటితం..

26 Feb, 2019 00:27 IST|Sakshi

ఉద్యోగాలపై సరైన డేటా  లేకపోవడానికి కారణమదే 

ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ బిబేక్‌ దేబ్రాయ్‌ 

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అసంఘటితంగా ఉండటం వల్ల ఉద్యోగాల కల్పన, ఎకానమీపై సరైన గణాంకాలు లభించడం కష్టమని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ బిబేక్‌ దేబ్రాయ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ హయాంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరిగిందంటూ ఒకవైపు, దేశం వృద్ధి సాధిస్తున్నా ఉద్యోగాలు కరువయ్యాయన్న వార్తలు మరోవైపు వస్తున్న నేపథ్యంలో దేబ్రాయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా అసంఘటిత రంగాల్లోనే పని చేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు అత్యధికంగా ఉంటున్నందున..
 
ఉద్యోగాల కల్పనపై కంపెనీల నుంచి లభించే డేటాతో ఒక అంచనాకు రావడం కష్టమని ఆయన పేర్కొన్నారు. స్కోచ్‌ గ్రూప్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా దేబ్రాయ్‌ ఈ విషయాలు చెప్పారు. మోదీ హయాంలో అసంఘటిత రంగంలో ఉపాధి కల్పన భారీగా పెరిగిందంటూ స్కోచ్‌ గ్రూప్‌ ఈ సదస్సులో నివేదిక విడుదల చేసింది. ముద్ర రుణ పథకం, స్వయం సహాయక బృందాల గణాంకాలు, ఇన్‌ఫ్రా రంగంలో పరిణామాలు మొదలైనవి ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ప్రస్తుత సర్కారు హయాంలో అసంఘటిత రంగంలో ఇప్పటిదాకా 2 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు