కౌంట్ డౌన్ స్టార్ట్: కస్టమర్లకు బ్యాంకులు అలర్ట్

20 Jun, 2017 19:16 IST|Sakshi
కౌంట్ డౌన్ స్టార్ట్: కస్టమర్లకు బ్యాంకులు అలర్ట్
న్యూఢిల్లీ : దేశ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీని జూన్ 30 అర్థరాత్రి గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ జీఎస్టీ అమలుతో మోతకెక్కనున్న బిల్లుల విషయంలో బ్యాంకులు, క్రెడిట్ కార్డుల ప్రొవైడర్లు, ఇన్సూరర్స్ కస్టమర్లకు అలర్ట్ లు పంపుతున్నాయి. జూలై 1 నుంచి అమలుకాబోతున్న జీఎస్టీతో ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుందని కస్టమర్లకు ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సర్వీసులు 15 శాతం సర్వీస్ పన్నును ప్రభుత్వానికి చెల్లించేవి. కానీ 2017 జూలై 1 నుంచి వ్యాట్, సర్వీసు ట్యాక్స్ లాంటి అన్ని పరోక్ష పన్నులు వెళ్లిపోయి, వాటిస్థానంలో జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. 
 
జీఎస్టీ కింద ఫైనాన్సియల్, టెలికాం సర్వీసులను 18 శాతం శ్లాబుల రేట్లలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఎక్కువగా ఈ సర్వీసులకు పన్నులు కట్టాల్సి ఉందని, ఈ మేరకు క్రెడిట్ కార్డు బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగనున్నాయని తెలిసింది. ఎస్బీఐ కార్డు ఈ అత్యధిక పన్ను శ్లాబులపై కస్టమర్లకు అవగాహన కల్పించడానికి ఎస్ఎంఎస్ లు పంపుతోంది. ''ముఖ్యమైన ప్రకటన: 2017 జూలై 1 నుంచి ప్రభుత్వం జీఎస్టీ అమలుచేయబోతుంది. దీంతో ప్రస్తుతమున్న 15 శాతం పన్ను రేట్లు, జీఎస్టీ శ్లాబు నిర్ణయించిన 18 శాతం పన్నుపరిధిలోకి వస్తున్నాయి'' అని ఈ ఎస్ఎంఎస్ లో తెలిపింది.
 
ఇదే విధంగా ఇతర బ్యాంకులు స్టాండర్డ్ ఛార్టెడ్, హెచ్డీఎఫ్సీ కూడా మెసేజ్ లు పంపుతున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తన కస్టమర్లకు ఈమెయిల్స్ పంపింది. కొత్త పన్ను విధానం కింద 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఎండోవ్మెంట్ పాలసీకు ప్రీమియం పేమెంట్ రేటు 2.25 శాతం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాలసీలకు 1.88 శాతం సర్వీసు ట్యాక్స్ మాత్రమే ఉంది. జూన్ 30 అర్థరాత్రిన జీఎస్టీని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రకటించేశారు. ఇక ఎలాంటి వాయిదాలకు అవకాశం లేదని తేలిపోయింది.
మరిన్ని వార్తలు