సైబర్ నేరస్తులకు.. ప్రేమికుల రోజంటే పండగే!

10 Feb, 2015 07:54 IST|Sakshi
సైబర్ నేరస్తులకు.. ప్రేమికుల రోజంటే పండగే!

సైబర్ నేరాలకు అవకాశముందని ట్రెండ్ మైక్రో హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజంటే (ఫ్రిబ్రవరి 14) మనకే కాదు.. సైబర్ నేరస్తులకూ పండగే. అయితే మనం ఆన్‌లైన్‌లో గులాబీ పూలు, బహుమతులిచ్చి ఆనందిస్తే.. వారు మాత్రం బూటకపు ప్రకటనలు, ప్రమోషన్లతో మనల్ని టార్గెట్ చేసి ట్రాప్ చేసే ప్రమాదముంది. అందమైన ప్రకటనలు, ఆఫర్లతో ఇంటర్నెట్ వినియోగదారుల్ని ఆకర్షించడమే సైబర్ నేరస్తులు టార్గెట్ అని సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ ట్రెండ్ మైక్రో హెచ్చరించింది.

ప్రపంచంలో డేటింగ్ సైట్లు, స్పామ్ ప్రకటనల వంటి సైబర్ మోసాలు ఎక్కువగా జరిగే దేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల తర్వాత మనదే రెండో స్థానమని ట్రెండ్ మైక్రో తెలిపింది. ఎక్కువగా ఇంటర్నెట్‌లో విహరిస్తూ.. గిఫ్ట్‌లను పంపించే పురుషుల్ని లక్ష్యంగా పెట్టుకొని సైబర్ నేరాలకు పాల్పడతారని ట్రెండ్ మైక్రో ఎండీ (ఇండియా అండ్ సౌత్‌ఈస్ట్ ఏషియా) ధన్య థక్కర్ చెప్పారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో వచ్చే బూటకపు ప్రకటనలు క్లిక్ చేసినా, ఈ-మెయిళ్లకు సమాధానాలిచ్చినా ప్రమాదంలో పడటం ఖాయమని హెచ్చరించింది. ఇప్పటికే ఈ స్పామ్‌లో 117 ఐపీలు చిక్కుకున్నట్టు గుర్తించామని థక్కర్ చెప్పారు.

ఇవి ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, ఉక్రెయిన్, కెనడా, నెదర్లాండ్ దేశాల నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు. అందమైన పువ్వులు, క్యాండీళ్లు వంటి వాటితో ప్రేమికుల దినోత్సవం థీమ్‌గా జర్మనీ, చైనీస్ భాషల్లో పలు ఈ-మెయిల్స్ వచ్చాయన్నారు. అపరిచితుల నుంచి వచ్చిన మెయిల్స్‌లను , లింకులకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా థక్కర్ సూచించారు.

మరిన్ని వార్తలు