నానో కథ కంచికి!?

5 Jul, 2018 00:51 IST|Sakshi

జూన్‌లో ఒకే ఒక కారు తయారీ 

మూడు కార్ల విక్రయం 

ఇక ఎగుమతులు శూన్యం

న్యూఢిల్లీ: లక్ష రూపాయల కారు అంటే చాలు నానో గర్తుకొస్తుంది. దీన్ని రతన్‌ టాటా మానసపుత్రికగా అభివర్ణిస్తారు. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నానో కారును ఆవిష్కరించారు. టూవీలర్‌ జర్నీకి ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటు ధరలో, సురక్షితమైన ప్రయాణానికి ఒక వెసులుబాటు అందించాలని భావించారు. అయితే ఏం లాభం. అంచనాలన్నీ తప్పాయి. టాటా మోటార్స్‌ కి ఇదో ఫెయిల్యూర్‌ వెంచర్‌గా మిగిలింది.  

ఒకే కారు తయారీ...
ఇప్పుడు నానో కారు తన ప్రస్థానానికి ముగింపు పలకడానికి కుసుమంత దూరంలో ఉంది. జూన్‌ నెలలో కేవలం ఒకే ఒక నానో కారు తయారైంది. కంపెనీ గతేడాది ఇదే నెలలో 275 యూనిట్లను తయారు చేసింది. దేశీ మార్కెట్‌లో మూడు కార్లు మాత్రమే విక్రయమయ్యాయి. గతేడాది ఇదే నెలలో నానో విక్రయాలు 167 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతుల ఊసే లేదు. కానీ గతేడాది ఇదే నెలలో కంపెనీ 25 యూనిట్లను ఎగుమతి చేసింది. పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ నానో కార్ల తయారీ నిలిపివేతపై కంపెనీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నానోను 2019 తర్వాత కొనసాగించడం కష్టమే. దీని మనుగడకు కొత్త పెట్టుబడులు అవసరం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని టాటా మోటార్స్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కీలకమైన మార్కెట్లలో కస్టమర్‌ డిమాండ్‌ను అందుకోవడానికి నానో తయారీని కొనసాగిస్తామని పేర్కొన్నారు.  

ఆది నుంచీ అడ్డంకులే.. 
నానో కారును తొలిగా 2008 జనవరిలో జరిగిన ఆటోఎక్స్‌పో కార్యక్రమంలో ప్రదర్శించారు. 2009 మార్చిలో రూ.లక్ష ప్రారంభ ధరతో  మార్కెట్‌లోకి వచ్చింది. నానోకు ఆది నుంచీ అడ్డంకులే. దీన్ని మొదట పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేసి తీసుకురావాలని భావించారు. అయితే ప్లాంట్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం, ప్రతికూల రాజకీయ పరిస్థితుల వల్ల నానో తయారీ ప్రాజెక్టు గుజరాత్‌లోని సనంద్‌ ప్లాంటుకు మారింది. నానోను చౌక కారుగా ప్రమోట్‌ చేయడం తప్పైందని రతన్‌ టాటా ఒక సందర్భంలో అంగీకరించారు. 

మరిన్ని వార్తలు