10 లక్షలు దాటితే ఆన్‌లైన్‌లోనే..

28 Feb, 2018 01:09 IST|Sakshi

 పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌కి ఈపీఎఫ్‌వో నిబంధన

న్యూఢిల్లీ: ప్రావిడెంట్‌ ఫండ్‌ క్లెయిమ్‌ రూ. 10 లక్షలకు మించితే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయం తీసుకుంది. అలాగే, ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ 1995 కింద విత్‌డ్రా చేసుకునే మొత్తం రూ. 5 లక్షలు మించినా.. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి కానుంది. ఈ పింఛను పథకం కింద.. పాక్షికంగా కూడా పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకునే వీలుంది. ఇందుకోసం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌తో పాటు మ్యాన్యువల్‌గా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

ఉమంగ్‌ యాప్‌ నుంచే పీఎఫ్‌కు ఆధార్‌ లింక్‌
ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్‌ ఖాతాను (యూనివర్సల్‌ అకౌంట్‌) ఆధార్‌తో అనుసంధానించుకోవడం మరింత సులభతరం అయింది. ఉమంగ్‌ యాప్‌ నుంచి అనుసంధానించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సభ్యుల సౌకర్యం కోసం యూఏఎన్‌–ఆధార్‌ లింకింగ్‌ సదుపాయాన్ని ఉమంగ్‌ యాప్‌లో కల్పించినట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. పలు రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉమంగ్‌ యాప్‌ను తీసుకువచ్చింది.

మరిన్ని వార్తలు