మార్కెట్‌కు ద్రవ్యలోటు పోటు

1 Dec, 2017 01:23 IST|Sakshi

పెరిగిన ద్రవ్యలోటు

పడిపోయిన ఆసియా మార్కెట్లు

ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ, కొరియా ఉద్రిక్తతల ప్రభావం

453 పాయింట్లు పతనమై 33,149కు సెన్సెక్స్‌

135 పాయింట్ల నష్టంతో 10,227కు నిఫ్టీ

ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే ఆందోళనల కారణంగా స్టాక్‌ మార్కెట్‌ గురువారం భారీగా నష్టపోయింది. ఆసియా మార్కెట్ల పతనం,  జీడీపీ గణాంకాలు ఎలా ఉంటాయోనన్న సందేహాలు, నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపడంతో స్టాక్‌ సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 453 పాయింట్లు నష్టపోయి 33,149 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 135 పాయింట్లు నష్టపోయి 10,227 పాయింట్ల వద్ద ముగిశాయి. గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 494 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్ల వరకూ నష్టపోయాయి. రియల్టీ సూచీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.

దెబ్బతిన్న సెంటిమెంట్‌
ద్రవ్యలోటు పెరగడంతో మార్కెట్, రూపాయి పతనమయ్యాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఒపెక్‌ చమురు కోత కొనసాగుతుందనే అంచనాల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారని వివరించారు. నవంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ, ఆసియా మార్కెట్లు నష్టపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని పేర్కొన్నారు.

ఇవీ పతనానికి కారణాలు...
96.1%కి ద్రవ్యలోటు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో ద్రవ్యలోటు 96.3%కి పెరిగింది. ఆదాయం తక్కువగా ఉండడం, వ్యయం పెరగడంతో ద్రవ్యలోటు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలానికి రూ.4.2 లక్షల కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.5.25 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 3.2 శాతానికే ద్రవ్యలోటును పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం విఫలమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న అంచనాలు మార్కెట్‌ను పడగొట్టాయి.

జీడీపీ గణాంకాల వెల్లడి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో తైమాసిక జీడీపీ గణాంకాలను మార్కెట్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. ఈ గణాంకాలు సానుకూలంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ, స్టాక్‌ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి.

నవంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ: నవంబర్‌ నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టుల ముగింపు కావడంతో స్టాక్‌ సూచీలు ఒడిదుడుకుల్లో ట్రేడయ్యాయి.

ఆసియా మార్కెట్ల పతనం: జపాన్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్ల పతనం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మైక్రో చిప్‌ల బూమ్‌ శిఖర స్థాయికి చేరిందన అంచనాల కారణంగా టెక్నాలజీ షేర్ల పతనంతో ఆసియా మార్కెట్లు క్షీణించాయి. హాంగ్‌సెంగ్‌ 1.5%, షాంఘై 0.6% చొప్పున నష్టపోయాయి.

కొరియా ఉద్రిక్తతలు: ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. అమెరికాపై కొరియా అణ్వాయుధాలతో దాడులు చేయవచ్చన్న ఆందోళనలు పెరిగాయి.

పుంజుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ: అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో భారత్‌ వంటి   దేశాల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధులు అమెరికా మార్కెట్‌కు తరలిపోతాయనే అంచనాలున్నాయి.

ఒపెక్‌ సమావేశం: ఉత్పత్తిలో కోత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పుంజుకోవడం చమురు దేశాలకు ఊరటనిస్తోంది. ఉత్పత్తి కోతను కొనసాగించడానికి ఉద్దేశించిన ఒపెక్‌ సమావేశం జరగనుండడం ప్రతికూల ప్రభావం చూపించింది.

లాభాల స్వీకరణ: గత మూడు రోజుల పతనానికి ముందు వరుసగా ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్ల పాటు స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి.  

రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 31 పైసలు క్షీణించి 64.62కు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. 

మరిన్ని వార్తలు