పంట రుణాల మాఫీ రూ. 4.7 లక్షల కోట్లకు

13 Jan, 2020 04:02 IST|Sakshi

గడిచిన పదేళ్లపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

ముంబై:  గడిచిన పదేళ్లలో వివిధ రాష్ట్రాలు మాఫీ చేసిన వ్యవసాయ రుణాల పరిమాణం ఏకంగా రూ. 4.7 లక్షల కోట్లకు చేరింది. ఇది మొత్తం పరిశ్రమల మొండిబాకీల్లో (ఎన్‌పీఏ) దాదాపు 82 శాతం. ఎస్‌బీఐ రీసెర్చ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.79 లక్షల కోట్లుగా ఉండగా, వీటిలో వ్యవసాయ రంగ ఎన్‌పీఏలు రూ. 1.1 లక్షల కోట్లకు చేరాయి. ‘మొత్తం ఎన్‌పీఏల్లో వ్యవసాయ రంగ బాకీలు రూ.1.1 లక్షల కోట్లుగానే ఉన్నా.. గడిచిన దశాబ్ద కాలంగా మాఫీ చేసిన సుమారు రూ. 3.14 లక్షల కోట్ల రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులు, ప్రభుత్వాల మీద ఏకంగా రూ. 4.2 లక్షల కోట్ల పైగా భారం పడినట్లే.

ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరో రూ. 45,000–51,000 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ. 4.7 లక్షల కోట్లకు చేరుతుంది. మొత్తం పరిశ్రమ స్థాయిలో పేరుకుపోయిన మొండిబాకీల్లో ఇది 82 శాతం అవుతుంది’ అని ఎస్‌బీఐ రీసెర్చ్‌ పేర్కొంది.      రుణభారాలతో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల సమస్య తీవ్రతను తగ్గించేందుకు పది పెద్ద రాష్ట్రాలు 2015 ఆరి్థక సంవత్సరం నుంచి రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రూ. 24,000 కోట్లు, తెలంగాణ రూ. 17,000 కోట్లు, తమిళనాడు రూ. 5,280 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశాయి. నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. మాఫీల్లో అత్యధిక భాగం తూతూమంత్రంగానే జరిగిందని .. వాస్తవ రైటాఫ్‌లు 60 శాతం మించబోవని నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు