మన మార్కెట్లలోనే  అస్థిరతలు తక్కువ

22 Dec, 2018 01:32 IST|Sakshi

సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి

కోల్‌కతా: అంతర్జాతీయ క్యాపిటల్‌ మార్కెట్లలో ఈ ఏడాది నెలకొన్న అస్థిరతలు మరికొంత కాలం పాటు కొనసాగొచ్చని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పేర్కొన్నారు. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు, చమురు ధరల్లో అస్థిరతలు, వాణిజ్య వివాదాలు పెరగడం, ఇరాన్‌పై ఆంక్షలు వంటి అంశాలను అస్థిరతలకు కారణాలుగా త్యాగి ఉదహరించారు. భారత మార్కెట్లు కూడా ఈ అంశాల కారణంగా ప్రభావితం అయ్యాయన్నారు. ఐఐఎం కలకత్తా నిర్వహించిన  భారత 8వ ఆర్థిక సదస్సులో త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన మార్కెట్లతోను, వర్ధమాన మార్కెట్లతోను పోలిస్తే అస్థిరతలు మన దగ్గరే తక్కువగా ఉన్నట్టు చెప్పారు.

భారత ఈక్విటీ మార్కెట్లో డిసెంబర్‌ మధ్య నాటికి ఆస్థిరతలు 12 శాతం వరకు ఉంటే, ఇదే కాలంలో బ్రిటన్‌లో 12 శాతం, అమెరికాలో 16 శాతం, చైనాలో 19 శాతం, జపాన్‌లో 17 శాతం, దక్షిణ కొరియాలో 14 శాతం, హాంగ్‌కాంగ్‌లో 19 శాతం, బ్రెజిల్‌లో 21 శాతంగా ఉన్నట్టు త్యాగి తెలిపారు. డౌ జోన్స్‌ ఈ ఏడాది సున్నా రిటర్నులు ఇస్తే, నిఫ్టీ రాబడులు 5.8 శాతంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు నిధుల లభ్యత సమస్య నెలకొందని, అయితే ఆర్‌బీఐ చేపట్టిన  చర్యలతో ఈ పరిస్థితి మెరుగుపడిందని చెప్పారాయన.  

మరిన్ని వార్తలు