శ్రావణమాసంలో షాక్‌ : పరుగాపని పుత్తడి

7 Aug, 2019 20:38 IST|Sakshi

ఆల్‌ టైం గరిష్టానికి పసిడి

10 గ్రా.  పుత్తడి ధర రూ. 37,920

కిలో వెండి ధర రూ. 43, 670

సాక్షి, ముంబై : అమెరికా, చైనా మధ్య తాజా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారానికి డిమాండ్‌ పుంజుకుంది. ఇటీవల మెరుపులు మెరిపిస్తూ, శ్రావణమాసంలో కస్టమర్లను భయపెడుతున్న పసిడి ధరలు బుధవారం  మరోసారి ఆల్‌ టైం గరిష్టానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా డిమాండ్‌ ఊపందుకోవడంతో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇవాళ ఒక్కరోజే  ఏకంగా రూ. 1,113 పెరిగి రూ. 38వేల మార్క్‌కు చేరువైంది.  10 గ్రాముల పుత్తడి ధర రూ.  37,920 వద్ద ఉంది.  పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో వెండి ధర కూడా  పెరిగింది. రూ. 650 పెరిగిన కిలో వెండి ధర  43,670  రూపాయలు పలుకుతోంది.  

దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ .1,113 పెరిగి రూ .37,920 కు చేరుకోగా, 99.5 శాతం స్వచ్ఛత గల పుత్తడి ధర రూ. 1,115 పెరిగి రూ .37,750 కు చేరుకుంది. సావరిన్ బంగారం కూడా ఎనిమిది గ్రాములకు రూ .200 పెరిగి 27,800 రూపాయలకు చేరుకుంది.

స్థానిక డిమాండ్‌తోపాటు, బలమైన ప్రపంచ ధోరణి ప్రధానంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీసిందని విశ్లేషకులు తెలిపారు.  అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ రేట్‌ కట్‌, దేశీయ మార్కెట్లలో అమ్మకాలు బంగారం ధరకు ఊతమిస్తున్నాయన్నారు. 10 గ్రాములకి 37,920 రూపాయల బంగారం ధర ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో ఇదే తొలిసారని ఆల్ ఇండియా సారాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర జైన్ అన్నారు.

అంతర్జాతీయ స్పాట్ బంగారం ధరలు బుధవారం 1,490 డాలర్లకు చేరుకున్నాయి. ఔన్సు వెండి 16.81 డాలర్లు పలికింది. ట్రేడ్‌వార్‌ భయాలు,  ఫెడ్‌ రేట్‌ కట్‌, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారంలో కొనుగోళ్లు పుంజుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ  సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు. మరోవైపు దేశీయ కరెన్సీ వరుసగా అయిదువ రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. ఆర్‌బీఐ అనూహ్యంగా రెపో రేటును 35  బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంక్‌ సెక్టార్‌ బాగా నష్టపోయింది. 

మరిన్ని వార్తలు