ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్‌ సర్వీసులు

17 Dec, 2018 03:16 IST|Sakshi

ఇన్‌–ఫ్లయిట్‌ మార్గదర్శకాలు

నోటిఫై చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్‌ కాల్స్‌కు, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్, షిప్పింగ్‌ కంపెనీలు ఇక నుంచి ఇన్‌–ఫ్లయిట్, మారిటైమ్‌ వాయిస్‌.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం అవి దేశీ టెలికం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

ఇన్‌–ఫ్లయిట్‌ అండ్‌ మారిటైమ్‌ కనెక్టివిటీ (ఐఎఫ్‌ఎంసీ) రూల్స్‌ 2018గా ఈ మార్గదర్శకాలను వ్యవహరించనున్నట్లు, అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు డిసెంబర్‌ 14న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం భారత గగనతలంలో ఎగిరే విమానం కనీసం 3,000 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఐఎఫ్‌ఎంసీ సర్వీసులు యాక్టివేట్‌ అవుతాయి. వార్షికంగా రూ. 1 ఫీజుతో పదేళ్ల పాటు ఐఎఫ్‌ఎంసీ లైసెన్సులు జారీ అవుతాయి. అందించే సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి పర్మిట్‌ హోల్డరు.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు